
విద్య, వైద్యానికి పెద్దపీట
కథలాపూర్: అన్ని వర్గాలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని గంభీర్‌పూర్, దూలూర్, సిరికొండలో రూ.36 లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ కేంద్రాలు, భూషణరావుపేటలో రూ.20 లక్షలతో పల్లె దవాఖానాకు భూమిపూజ చేశారు. సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ వర్షకాలంలో నీరు నిల్వ చేస్తామని పేర్కొన్నారు. గురుకులం విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచామన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, జిల్లా సంక్షేమశాఖ అధికారి నరేశ్, సీడీపీవో మణెమ్మ, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు పాల్గొన్నారు.
వంశీని సన్మానించిన విప్ ఆది
కోరుట్ల: కోరుట్లలో ఆదివారం విద్యుత్ ప్రమాదానికి గురైన వారిని ప్రాణాలకు తెగించి కాపాడిన అలాల వంశీని విప్, కాంగ్రెస్ కోరుట్ల ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు సన్మానించారు. వంశీ తెగువతో చాలా మంది ప్రాణాలు దక్కాయన్నారు. జైలుకు వెళ్లేందుకు కేటీఆర్ తహతహాలాడుతున్నట్లు కనిపిస్తోందని, అందుకే తరచూ తనను జైలుకు పంపిస్తారని తనకు తానే చెప్పుకుంటున్నారని విప్ అన్నారు. సోమవారం రాత్రి కోరుట్లలో మాట్లాడారు.