
● విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు ● చిన్నపాటి గొడవలతో దూరం
జగిత్యాలక్రైం: ప్రస్తుత సమాజంలో బంధాలు బహుదూరమైపోతున్నాయి. ఒకప్పుడు అమ్మానాన్న, అన్న, తమ్ముడు, చెల్లె, బావ, అక్క, బావ, వదినె, మరుదలు, చిన్నమ్మ, చిన్నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న.. ఇలా బంధుత్వాలు బలంగా ఉండేవి. ఒకరికి ఏదైనా ఆపద వచ్చినా అందరూ మేమున్నామంటూ ధైర్యం చెబుతూ ఆదుకునేవారు. ఆత్మీయులు మృతిచెందితే ఆ కుటుంబానికి వెన్నంటి ఉండి వారిని ఓదార్చి మనోధైర్యం నింపేవారు. కానీ, ప్రస్తుతం ఆస్తిపాస్తులు, చిన్నపాటి గొడవలతో హత్యలకు పూనుకుంటున్నారు.
ఆత్మీయులు దూరం
ఒకప్పుడు ఎవరైనా అనారోగ్యంతో మృతిచెందినా, ప్రమాదాల్లో గాయపడినా వారి బంధువులు ఆ కుటుంబానికి ధైర్యంగా నిలబడేవారు. ప్రస్తుతం హత్యలతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కుటుంబాన్ని నెట్టుకొచ్చే వ్యక్తి, పిల్లల లాలనను చూసే తల్లి లేకపోవడం, కొంత మంది చిన్నారులు తల్లిదండ్రులకు దూరమవుతూ మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు దూరమవడం పిల్లల భవిష్యత్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే చిన్నపాటి కుటుంబ తగాదాలతో కుటుంబాన్నే వద్దనుకుని తన జీవితం తనదని అందరినీ వదిలివెళ్లి రహస్య జీవితాలు గడుపుతుండగా, వారి రక్తసంబంధీకుల మనోవేదన అంతా ఇంత కాదు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని వేదనతో రోజులు గడుపుతున్నారు.