
పాఠశాలల ప్రారంభం నాటికి దుస్తులు అందించాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థికి మహిళా సంఘ సభ్యులు నాణ్యమైన ఏకరూప దుస్తులు కొలతల ప్రకారం కుట్టాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకుడు దుర్గప్రసాద్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లోని మదర్‌థెరిస్సా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులు కుడుతున్న ఏకరూప దుస్తుల యూనిట్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు, దుస్తులు తయారీ గురించి తెలుసుకున్నారు. సెర్ఫ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులకు దుస్తులు అందించాలన్నారు. అనంతరం జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ, జిల్లాలో 667 పాఠశాలల్లో 47,963 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు కుట్టించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ మహేశ్, ఏపీఎం గంగాధర్, సీసీ విద్యాసాగర్, వీవోఏ బాలె విజయ, మండల సమైక్య అధ్యక్షురాలు గంగభవాని, యూనిట్ సభ్యులు పులి సంగీత, సుద్దాల జ్యోతి, నవ్య పాల్గొన్నారు.