ప్రాణం తీసిన ఈతసరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈతసరదా

May 16 2025 1:51 AM | Updated on May 16 2025 1:51 AM

ప్రాణ

ప్రాణం తీసిన ఈతసరదా

ఈతకు వెళ్లి యువకుడి మృతి

ఎలిగేడు(పెద్దపల్లి): స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు వచ్చిన యువకుడు ముష్కి రాజీవ్‌గాంధీ(36) ఈత కోసమని వెళ్లి నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన ముప్పిరితోట గ్రామంలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై సనత్‌ కుమార్‌ కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని జైభీమ్‌నగర్‌కు చెందిన ముష్కి రాజీవ్‌గాంధీ ఈనెల 14న ముప్పిరితోట గ్రామంలో జరిగిన శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతరకు వచ్చాడు. సాయంత్రం వేళ సరదాగా స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్లాస్టిక్‌ డబ్బా కట్టుకుని బావిలో దిగాడు. ప్రమాదవశాత్తు బావిలో నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం వ్యవసాయ బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

నీటి సంపులో పడి చిన్నారి మృతి

వేములవాడ అర్బన్‌: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన వేములవాడ మున్సిపల్‌ పరిధి తిప్పాపూర్‌లో గురువారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. తిప్పాపూర్‌లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి జిక్రా ఫాతిమా ప్రమాదవశాత్తు ఇంటి ముందు నీటిసంపులో పడిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

రైలు ఢీకొని యువకుడు..

మల్యాల: కొడిమ్యాల మండలం రాంసాగర్‌కు చెందిన అనుముల శేఖర్‌ (37) కొండగట్టు సమీపంలో రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వార్డు సభ్యుడిగా పనిచేసిన శేఖర్‌ ఇటీవల దుబాయ్‌ వెళ్లి వచ్చాడు. బుధవారం కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్‌ పక్కన మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొందా? రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు

జగిత్యాలక్రైం: అతిగా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధించారు. రాయికల్‌ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన అల్లెపు వెంకటనర్సయ్య ఇటీవల అతిగా మద్యం సేవించి వాహనం నడుపగా రాయికల్‌ ఎస్సై సుదీర్‌రావు పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం స్పెషల్‌ జ్యూడిషియల్‌ మెజిస్టేట్‌ సెకెండ్‌ క్లాస్‌ న్యాయమూర్తి కరుణాకర్‌ ముందు హాజరు పర్చగా ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

గొర్రె, మేకల దొంగల అరెస్టు

మల్యాల: గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు మల్యాల సీఐ నీలరం రవి, ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు. జగిత్యాలకు చెందిన ముద్దవేని అనిల్‌, మహ్మద్‌ మోసిన్‌, వెంకటేశ్‌లు రాత్రివేళ గ్రామాల్లో మోటారు సైకిల్‌, ఆటోల్లో తిరుగుతూ షెడ్లలోని గొర్రెలు, మేకలను దొంగిలించి కొన్నింటిని అమ్ముకోగా, మరికొన్నింటిని కోసి మాంసం విక్రయించే వారన్నారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మల్యాల ప్రాథమిక సహకార కేంద్రం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా బైక్‌, ఆటోలో రెండు మేకలు, రెండు గొర్రెలు తీసుకెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగిలించినట్లు అంగీకరించారన్నారు. బైక్‌, ఆటో, రెండు మేకలు, రెండు గొర్రెలు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ప్రాణం తీసిన ఈతసరదా 1
1/1

ప్రాణం తీసిన ఈతసరదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement