
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఏఈవోగా బుద్ధి శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఆలయంలో ఉద్యోగుల కొరత, భక్తులకు తలెత్తుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. స్పందించిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు.. హైదరాబాద్ లోనిగణేశ్ ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈవో బుద్ధి శ్రీనివాస్‌ను కొండగట్టు అంజన్న ఆలయానికి బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్ గతంలోనూ ఇక్కడే విధులు నిర్వర్తించారు. ఇటీవల హైదరాబాద్ బదిలీపై వెళ్లారు. అనుభవం ఉన్న అధికారి అవసరమనే ఉద్దేశంతోనే ఆయనను మళ్లీ ఇక్కడకు బదిలీ చేశారని తెలిసింది. కాగా, శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారు.