
మాట్లాడుతున్న అంజయ్య
కథలాపూర్(వేములవాడ): జిల్లా సరిహద్దులోని రాళ్లవాగు ప్రాజెక్టులో నీళ్లున్నా కథలాపూర్ మండలంలోని గ్రామాల ఆయకట్టుకు సాగునీటి విడుదలలో వివక్ష తగదని పీసీసీ కార్యవర్గ సభ్యుడు తొట్ల అంజయ్య అన్నారు. పంటలు ఎండిపోతున్నా పాలకులు పట్టనట్లు వ్యవహరించడం ఏంటని మండిపడ్డారు. సోమవారం కథలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాళ్లవాగు ప్రాజెక్టు ద్వారా 3,500 ఎకరాలకు నీళ్లందించడం లక్ష్యం కాగా.. భూషణరావుపేట, ఊట్‌పెల్లి, కథలాపూర్ గ్రామాల పరిధిలోని భూములకు యాసంగిలో ఎందుకు నీళ్లివ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కోనాపూర్ పరిధిలోని భూములకు రాళ్లవాగు ప్రాజెక్టు నీళ్లు పుష్కలంగా అందుతుంటే.. కథలాపూర్ మండలానికి ఎందుకివ్వడం లేదో చెప్పాల ని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్‌రెడ్డి, మండల నాయకులు ఎండీ.రెహనొద్దీన్, జిల్లా లచ్చన్న, రంజిత్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు.