నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు

Today is Great Oceans Day - Sakshi

సముద్రాల్లోకి ఏటా 12 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ 

2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్‌ ఎక్కువగా ఉంటుందని అంచనా 

సముద్ర కాలుష్యం వల్ల ఏటా 100 మిలియన్‌ జీవుల మృత్యువాత 

ఇప్పటికే మహా సముద్రాల్లో 500 డెడ్‌ జోన్‌లు 

ఇక్కడ ఆక్సిజన్‌ లేక జీవం ఉనికి ప్రశ్నార్థకం  

కాలిఫోర్నియాలో విక్రయించే చేపల పొట్టల్లో ప్లాస్టిక్‌

వాటిని తింటున్న మనుషులకూ అనారోగ్యం 

2030 నాటికి 30 శాతం సముద్రాలను రక్షించాలని ప్రపంచ దేశాల తీర్మానం 

నేడు మహా సముద్రాల దినోత్సవం 

మహా సముద్రాలు మన గ్రహానికి ఊపిరితిత్తులు. మానవ తప్పిదాల కారణంగా ఆ మహా సముద్రాలు కాలుష్య కాసారాలుగా మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భూ ఉపరితలంపై దాదాపు 70 శాతం నీటితో విలువైన వనరులుగా ఉంటూ.. భూమికి ఆక్సిజన్‌ సరఫరా చేయడంతోపాటు అనేక జాతుల మొక్కలకు, జంతువులకు నిలయంగా జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. అంతటి మహా సముద్రాలను ప్లాస్టిక్‌ పొరలు చుట్టేస్తున్నాయి. సాగర గర్భంలోని జాతులను నాశనం చేస్తున్నాయి.

సముద్ర కాలుష్యంపై నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఏటా సుమారు 12 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ సముద్రంలో కలుస్తోంది. దీని బరువు లక్ష నీలి తిమింగలాలకు సమానం. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లోని చేపల కంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అతిపెద్ద గ్రేట్‌ పసిఫిక్‌ గార్బేజ్‌ ప్యాచ్‌తో నిండిపోయింది. ఇందులో 1.8 ట్రిలియన్‌ ప్లాస్టిక్‌ ముక్కలు ఉన్నాయి. దీని విస్తీర్ణం అమెరికాలోని టెక్సాస్‌ భూ భాగానికి రెండింతలు.   - సాక్షి, అమరావతి

సముద్ర కాలుష్యం ఇలా.. 
సముద్ర కాలుష్యం అనేది కేవలం ప్లాస్టిక్, ఇతర కాలుష్య కారకాల వల్లే కాకుండా.. ఓడలు నుంచి వెలువడే శబ్ద కాలుష్యం కూడా పెను ప్రమాదంగా ఉంది. తిమింగలాలు, డాల్ఫిన్లు వంటి అనేక సముద్ర క్షీరదాలు నీటిలో తమ పరిసరాలను అర్థం చేసుకోవడానికి శబ్దాలు చేయడం ద్వారా సంభాషించుకుంటాయి. దీనిని ఎకోలోకేషన్‌గా పిలుస్తారు. అయితే ఓడలు, సోనార్లు, ఇతర పరికరాల నుంచి వచ్చే కృత్రిమ శబ్దాలు సముద్ర జీవుల కమ్యూనికేషన్‌ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా వలసలు చెదిరిపోవడంతో పాటు వాటి పునరుత్పత్తి, ఆహార వేట ప్రక్రియలను ప్రభావితం చేస్తోంది. ఒక్కోసారి ఓడలను ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడుతున్నాయి. 

చర్మ సౌందర్యానికి వినియోగించే సన్‌ స్క్రీన్‌ల తయారీలో పగడాలు, ఇతర సముద్ర జీవులను వాడటం వాటికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఆ జీవుల్లోని ఆక్సిబెంజోన్, ఆక్టినోక్సేట్‌ వంటి రసాయనాలు చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 

సముద్రంలో ముడి చమురు ట్యాంకర్లు రవాణా చేస్తున్నప్పుడు చమురు లీకవడంతో ఆ నీటిలో ఆక్సిజన్‌ స్థాయిలను తగ్గుతున్నాయి. ఆ చమురు సముద్ర జీవుల రెక్కలకు బలంగా అంటుకోవడంతో ఈదే శక్తిని కోల్పోతున్నాయి. ఆ నీటిలోని చేపలు తినడంతో మానవ ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. 

వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగించే కృత్రిమ రసాయనాలు, పరిశ్రమల ద్వారా వెలువడే కలుíÙత నీరు.. చిన్నచిన్న ప్రవాహాలు, నదుల ద్వారా సముద్రాల్లోకి కలుస్తాయి. లోతైన సముద్రపు మైనింగ్‌ కారణంగా నీటి అడుగున జీవం ఉనికి కోల్పోతోంది. 

కృత్రిమ కాంతి కాలుష్యం కూడా సముద్ర జీవుల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు.. ఒక పిల్ల తాబేలు దాని గుడ్డు నుంచి బయటకు వచి్చనప్పుడు, అది సముద్రాన్ని కనుగొనడానికి చంద్రకాంతిని అనుసరిస్తుంది. సముద్రతీర రెస్టారెంట్లు, బీచ్‌ సైడ్‌ క్యాబనాస్‌ (గుడారాలు), క్యాంప్‌ ఫైర్‌ల వెలుతురు వాటిని అడ్డుకుంటుంది.  

మహా సముద్రాల్లో 500 డెడ్‌ జోన్లు 
వివిధ రకాల సముద్ర కాలుష్యం కారణంగా ఏటా 100 మిలియన్‌ సముద్ర జంతువులు ప్రాణాలు కోల్పోతున్నట్టు శాస్త్రవేత్తల అంచనా. ఇది వెయ్యికి పైగా సముద్ర జాతుల ఉనికిపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. మహా సముద్రాల కాలుష్యం 500 డెడ్‌ జోన్లను సృష్టించింది. ఇక్కడి ఆక్సిజన్‌ స్థాయిలు చాలా తక్కువ ఉండటంతోపాటు జీవం ఉనికే ఉండని పరిస్థితి ఏర్పడింది. సముద్రాల్లో మితిమీరిన చేపల వేట కూడా ప్రమాదకరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

మితిమీరిన చేపలు వేట, కాలుష్యం కారకాల నుంచి సముద్రాలను రక్షించాలని ఐక్యరాజ్య సమితిలోని సభ్య దేశాలు తీర్మానించాయి. 2030 నాటికి ప్రపంచంలోని 30 శాతం భూమి, సముద్రాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని ఒప్పందం చేసుకున్నాయి. ఇక స్విస్‌ ఆధారిత ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) రెడ్‌ లిస్ట్‌ జాబితా ప్రకారం నీటి అడుగున మొక్కలు, జంతువులు 10 శాతం అంతరించిపోయే స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

చేపల ద్వారా మానవ దేహంలోకి ప్లాస్టిక్‌ 
సముద్రాల్లో ప్లాస్టిక్‌ సీసాలు, బ్యాగ్‌లు, సిగరెట్‌ పీకలు, స్ట్రాలు, టైర్లు, వేట వలలు వంటివి చేపలు, ఇతర జీవుల మరణాలకు కారణమవుతున్నాయి. తాబేళ్లు, సముద్ర పక్షులు కొన్నిసార్లు వాటిని ఆహారంగా భావించి తినడంతో వాటి జీర్ణ వ్యవస్థ కోసుకుపోయి.. చివరికి ఆకలితో మరణిస్తున్నాయి. సాగరాల్లోని మైక్రో ప్లాస్టిక్‌లను చేపలు తింటుంటే.. ఆ చేపలను తిన్న మనుషుల శరీరాల్లోకి ప్లాస్టిక్‌ చేరుతోంది.

ఉత్తర పసిఫిక్‌ తీరంలోని చేపలు ఏడాదికి 24 వేల టన్నుల ప్లాస్టిక్‌ ముక్కలు తింటున్నట్టు.. అవి మానవుల ఆహారంలో కలుస్తున్నట్టు కనుగొన్నారు. కాలిఫోరి్నయాలోని మార్కెట్‌లో విక్రయించే నాలుగింట ఒక వంతు చేపల పొట్టల్లో ప్లాస్టిక్‌ మైక్రో ఫైబర్స్‌ను గుర్తించారు. ఇక్కడ ఒక వ్యక్తి ఏడాదికి సగటున 74 వేల మైక్రో ప్లాస్టిక్‌లు తింటున్నట్టు తేల్చారు. భారతదేశంలో సముద్రంలో చేరే చెత్తలో 60 శాతం ప్లాస్టిక్‌ ఉంటోంది. స్వచ్ఛ్‌ సాగర్, సురక్షిత్‌ సాగర్‌ క్యాంపెయిన్‌ ప్రకారం ఇక్కడి సముద్ర తీరంలోని ప్రతి కిలో మీటరుకు సగటున 0.98 మెట్రిక్‌ టన్నుల చెత్తను గుర్తించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top