సంచలన ఆరోపణలు.. ఖండించిన ఇజ్రాయెల్‌

Human Rights Watch Alleges Israel Use White Phosphorus Gaza Lebanon - Sakshi

హమాస్‌ ఉగ్రవాదుల్ని ఏరివేసే లక్ష్యంతోనే.. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. గాజాలోని 3,600 హమాస్‌ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించుకుంది. ఉద్రిక్తతలు మొదలైన ఈ ఆరు రోజుల్లో.. నాలుగు వేల టన్నుల బరువున్న ఆరు వేల బాంబులను గాజాపై జారవిడిచినట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులతో అమాయక ప్రజలతో పాటు తమ దగ్గర బందీలుగా ఉన్నవాళ్లు సైతం మృతి చెందినట్లు హమాస్‌ చెబుతోంది.  

తాజాగా ఇజ్రాయెల్‌పై సంచలన ఆరోపణలు చేసింది న్యూయార్క్‌కు చెందిన హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ అనే సంస్థ. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు ఉపయోగిస్తోందని ఆరోపించింది. ‘‘అక్టోబరు 10న లెబనాన్‌పై, అక్టోబరు 11న గాజాపై ఇజ్రాయెల్‌ ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన వీడియోలను పరిశీలించాం.  వాటిలో వైట్ పాస్ఫరస్‌ ఆనవాళ్లు ఉన్నాయి. ఇవి పౌరులపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి’’ అని  హ్యుమన్‌ రైట్స్ వాచ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం.. గాజాలో వైట్ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగించలేదని చెబుతోంది. 

2008-09లో గాజాపై వైట్‌ పాస్ఫరస్‌ బాంబులను ఇజ్రాయెల్‌ ప్రయోగించింది. అయితే 2013లో అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా.. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశామని ప్రకటించుకుంది. ఈ క్రమంలో.. తాజాగా మరోసారి ఇజ్రాయెల్‌ వీటిని గాజాపై ప్రయోగించిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 

ఇదిలా ఉంటే..  అంతర్జాతీయ చట్టాల ప్రకారం వైట్‌ పాస్పరస్‌ బాంబుల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు. దీంతో కొన్ని దేశాలు దాడుల్లో భాగంగా వీటిని ప్రయోగిస్తున్నాయి. రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంలో తమ సైన్యంపై రష్యా వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఆరోపించారు. 

వైట్‌ పాస్పరస్‌ బాంబులు.. భారీగా పొగతో పాటు కాంతిని వెదజల్లుతాయి. యుద్ధంలో ఎక్కువగా బంకర్‌లు, భవనాలను నాశనం చేసేందుకు పాస్ఫరస్‌ బాంబులను ఉపయోగిస్తారు. కానీ, వీటి కారణంగా మనిషి ఆరోగ్యం దెబ్బ తింటుందని.. దీర్ఘ కాలిక రోగాలకు కారణమవుతాయని వైద్యరంగ నిపుణులు  మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top