
డాక్టర్ జయపాలరెడ్డికి అరుదైన గౌరవం
గుంటూరు మెడికల్: ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోగా మంగళగిరి ఎన్నారై మెడికల్ కాలేజ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జయపాలరెడ్డి వెలగల ఎంపికయ్యారు. ప్రపంచ వైద్య రంగంలో ముఖ్యంగా సర్జికల్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ అనే బిరుదు ఆయనకు లభించింది. ఈ విషయాన్ని ఏసీఎస్ డైరెక్టర్ మైఖేల్ ఇ–మెయిల్ ద్వారా డాక్టర్ జయపాలరెడ్డికి తెలిపారు. చికాగోలో అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు క్లీనికల్ కాంగ్రెస్ సమావేశం జరగనుంది. 10 వేల మందికిపైగా హాజరుకానున్నారు. ఆ కార్యక్రమంలో డాక్టర్ జయపాలరెడ్డి ఈ గౌరవాన్ని స్వీకరించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన ఆయన విశాఖపట్నంలో 2004లో ఎంబీబీస్ చదివారు. పాండిచ్చేరి జిప్‌మర్‌లో 2012లో జనరల్ సర్జరీలో పీజీ చేశారు. కేరళ కొచ్చిలోని అమృత ఇనిస్టిట్యూట్‌లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, జపాన్‌లో ఫెలోషిప్ చేశారు. కొచ్చిలో ఐదేళ్లపాటు, ముంబయి కోకిలా బెన్ హాస్పిటల్‌లో ఏడాదిపాటు పనిచేశారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, పెద్దపేగు క్యాన్సర్, చిన్నపేగు క్యాన్సర్, ప్యాంక్రియాస్ సర్జరీలు, రోబోటిక్ సర్జరీలు చేశారు. ఎన్నారై మెడికల్ కాలేజ్‌లో 2021 నవంబర్ నుంచి సంబంధిత వైద్య విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. 1500కుపైగా ఆపరేషన్లు విజయవంతంగా చేశారు. ఈ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ జయపాలరెడ్డి తెలిపారు. వైద్య కళాశాల, హాస్పిటల్ యాజమాన్యం, సర్జన్లు ఆయన్ను అభినందించారు.