
మాదకద్రవ్యాలతో యువత నిర్వీర్యం
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న యువత, విద్యార్థులు నిర్వీర్యమైపోతున్నారని ఏపీ పోలీస్ ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ నివారణపై ఆదివారం కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యా లు, మత్తు పదార్థాల వలన నేరాలు అధికంగా ఉన్నాయని, అరికట్టేందుకు ప్రభుత్వం తమ విభాగాన్ని ఏర్పాటు చేసిందన్నారు. డ్రగ్స్ రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మత్తుకు బానిసలు కావడం దురదృష్టకరమని తెలిపారు. కళాశాలల్లో అవగాహన సదస్సుల ద్వారా దుష్పరిణామాలను వివరిస్తున్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ రించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్ర రాజు మాట్లాడుతూ యువతలో బాధ్యత పెంచేలా ఈగల్ వింగ్ తో కలిసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను పురుషుల కంటే మహిళలు అధికంగా వాడటం దురదృష్టకరమని, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలని తెలిపారు. మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆకే రవికష్ణ ప్రారంభించారు. ఈగల్ పోలీస్ వింగ్ ఎస్పీ నగేష్ బాబు, డీఎస్పీ అరవింద్, తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ భానుమతి తదితరులు పాల్గొన్నారు.