
ముగిసిన ఇస్కాన్ మందిర జగన్నాథస్వామి ఉత్సవాలు
తెనాలి: తెనాలి నాజరుపేటలోని ఇస్కాన్ మందిరంలో జరుగుతున్న జగన్నాథస్వామి ఉత్సవాలు నాలుగో రోజైన మంగళవారం రాత్రితో ముగిశాయి. సోమవారం రాత్రి జగన్నాథ రథయాత్ర ముగిసిన తదుపరి, ఇక్కడి బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన గుండిదా మందిరంలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రామాతను అక్కడ కొలువు ఉంచిన విషయం తెలిసిందే. చివరి రోజు రాత్రి పట్టణ, పరిసర ప్రాంతాలకు చెందిన పెద్ద ఎత్తున పాల్గొని సుభద్రాదేవికి చీర, సారె, పసుపు కుంకుమలను సమర్పించారు. ఈ వేడుకల సందర్భంగా గత నెల 28, 29 తేదీల్లో నిర్వహించిన వివిధ కళాసాంస్కృతిక పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు వేలమంది పాల్గొన్నట్టు ఇస్కాన్ మందిర నిర్వాహకుడు సింహ గౌరదాసు చెప్పారు. సుభద్రాదేవికి సారె సమర్పణ అనంతరం ఆయా పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లను, జ్ఞాపికలను బహూకరించారు. అత్యధికంగా 28 జ్ఞాపికలను గెలుచుకున్న స్థానిక వెస్ట్‌బెర్రీ స్కూలుకు ఓవరాల్ ఛాంపియన్‌గా ట్రోఫీని బహూకరించారు. మందిర ఉత్సవాలకు సహకరించిన బలరాం గోవింద ప్రభు, వైష్ణవి, భార్గవ్, వెంకటేష్, అపూర్వ, ఆశ్రిత, గాయత్రి, వెస్ట్‌బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం, శివశంకర్, పావని, తేజ, మురళి, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. తొలుత పినపాడుకు చెందిన కోదాడ బృందం వాయిద్యాల నడుమ మహిళలు ఊరేగింపుగా సారెను తీసుకొచ్చారు.
సుభద్రాదేవికి సారె
సమర్పించిన మహిళలు
వైభవంగా జగన్నాథ రథయాత్ర
పెదకాకాని: విశ్వ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా వీవీఐటీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రథయాత్ర విద్యార్థుల భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. గుంటూరు జిల్లా పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి విశ్వవిద్యాలయం వరకు సుభధ్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన రథయాత్రను వివా వీవీఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యులు భక్తిశ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తనలు జయ జయహే జై జగన్నాథ నినాదాలతో యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో గోళ్లమూడి గ్రామ ప్రజలు హారతులు, పూలు జల్లుతూ రథయాత్రకు స్వాగతం పలికారు. అనంతరం ఇస్కాన్ సభ్యులు యూనివర్శిటి వద్ద దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహా హారతి నిర్వహించి, విద్యార్థులు, భక్తులకు తీర్థప్రసాదాలు అందించి రథయాత్రను దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో వివా, వీవీఐటియూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ముగిసిన ఇస్కాన్ మందిర జగన్నాథస్వామి ఉత్సవాలు

ముగిసిన ఇస్కాన్ మందిర జగన్నాథస్వామి ఉత్సవాలు