
విద్యుత్ స్మార్ట్ మీటర్లను తిరస్కరించండి
సుందరయ్యనగర్‌లో సీపీఎం నేతల ప్రచారం
తెనాలి: అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని ప్రజలు స్పష్టంగా తిరస్కరించాలని, చూస్తూ ఊరుకుంటే తరతరాలుగా ఇరుక్కుపోతారని సీపీఎం నాయకులు ప్రజలను హెచ్చరించారు. సీపీఎం నాయకులు కేబీ ప్రసాద్, శెట్టి ఏసోబులు మంగళవారం తెనాలి సుందరయ్యనగర్‌లో విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అదానీ కంపెనీ ప్రతినిధులు వినియోగదారుల సమ్మతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా బలవంతంగా విద్యుత్ మీటర్లు మార్చుతున్నారని కేబీ ప్రసాద్ చెప్పారు. స్మార్ట్ మీటర్లుగా పిలుచుకునే ఆ మీటర్లలో ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. అందులో ఉండే ‘అడ్వాన్స్‌డ్ మీటరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్’ (ఏఎంఐ) ద్వారా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చని, వైర్‌లెస్ ద్వారా ఆ మీటర్ అదాని కంపెనీకి కనెక్ట్ చేయబడి ఉంటుందన్నారు. ఎక్కడో ఉండి ఆ మీటర్‌ను ఆపరేట్ చేయొచ్చని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. రెండోది ‘ఆటోమేటిక్ మీటర్ రీడింగ్’ (ఏఎంఆర్) అని చెబుతూ ఏ సమయానికి ఎంత విద్యుత్ వాడుకున్నదీ రికార్డు చేస్తుందన్నారు. పీక్ అవర్స్‌లో 6–10 గంటల వరకు అధిక చార్జీలు వసూలు చేస్తారని వివరించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుపై మాట్లాడుతూ వాడుకున్న విద్యుత్‌కు తర్వాత డబ్బులు చెల్లించే ప్రస్తుత పద్ధతికి భిన్నంగా, ముందుగానే డబ్బులు చెల్లించి సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్ చేయించితేనే విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. విద్యుత్‌ను సౌకర్యంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా, సరుకుగా మార్చి ప్రజలను పిండుకోవటానికి వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వి.బాబూరావు, యు.బుజ్జి, శెట్టి పౌలు, వి.సూరిబాబు, ఎస్.బాలస్వామి, మేరి, శెట్టి సలోమి, ఎస్.సింధు, కె.మరియమ్మ, ఎస్.అరుణప్రమీల, పి.జ్యోతి, కె.లక్ష్మమ్మ, నరసమ్మ పాల్గొన్నారు.