
ప్రతి పౌరునికి అందుబాటులో బ్యాంకింగ్ సేవలు
జిల్లా అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి
కొరిటెపాడు(గుంటూరు): ప్రతి పౌరునికి బ్యాంకింగ్, బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలు అందుబాటులో ఉండేలా చేయడమే జన సురక్ష శిబిరాల లక్ష్యమని జిల్లా అసిస్టెంట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో జన సురక్ష మూడు నెలల శిబిరాలను తెనాలి మండలం, కొలకలూరు గ్రామంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ స్థాయిలో ఆర్థిక సేవలను విస్తరించేందుకు చేపట్టిన జన సురక్ష సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. శిబిరాల్లో జన్ ధన్ ఖాతాల ప్రారంభం, జీవన్‌జ్యోతి, సురక్ష బీమా పథకాలలో నమోదు, అటల్ పెన్షన్ యోజన సభ్యత్వం, పాత ఖాతాలకు ఈకేవైసీ చేయించడం, డిజిటల్ మోసాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఏపీఎం జయశ్రీ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఇన్‌చార్జి శ్యామ్ ప్రసాద్, కొలకలూరు యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియా బ్రాంచి మేనేజర్ హర్ష, పంచాయతీ కార్యదర్శి కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.