
దౌత్య సంబంధాలు మరింత బలోపేతం
● కెన్యాలోని విహిగ కౌంటీ గవర్నర్ హెచ్‌ఈ డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో ● విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన ఎనిమిది మంది కెన్యా దేశ ప్రతినిధులు
చేబ్రోలు: భారత్–కెన్యా దేశాల మధ్య అకడమిక్, పరిశోధనలు, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ, బయో మెడికల్, స్కిల్ డెవలప్‌మెంట్, డ్రోన్ టెక్నాలజీతో పాటు పరస్పర అవగాహన, దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని కెన్యాలోని విహిగ కౌంటీ గవర్నర్ హెచ్‌ఈ డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ డీన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కెన్యా దేశానికి చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ విల్బర్ కే. ఓచ్చిలో మాట్లాడుతూ తమ దేశంలో విద్యా అవకాశాలను మెరుగుపరచడం, సాంస్కృతిక మార్పిడిని సులభం చేయడం, కెన్యా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కెన్యాలో వ్యవసాయం, ఆహార సాంకేతికత, స్మార్ట్ అగ్రికల్చర్, బయో మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డ్రోన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో పురోగతికి విజ్ఞాన్ యూనివర్సిటీ సహకారం కావాలని కోరారు. విజ్ఞాన్ అందించే అత్యాధునిక సాంకేతిక వనరులు, పరిశోధన ప్రమాణాలు, విద్యారంగ నైపుణ్యాలు కెన్యా యువతకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా డ్రోన్ సాంకేతికత, స్మార్ట్ వ్యవసాయ పద్ధతులపై తమ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ కెన్యా ప్రభుత్వ అభ్యర్థనను యూనివర్సిటీ అధిక ప్రాధాన్యతగా పరిగణిస్తోందని చెప్పారు.త్వరలోనే విద్య, పరిశోధన, శిక్షణల పరంగా ద్వైపాక్షిక ఒప్పందాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పి.ఎం.వి రావు, డీన్లు పాల్గొన్నారు.