
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం
సత్తెనపల్లి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చిలుకా జయపాల్ ఆదివారం ఖండించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తప్పుడు కేసులతో దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ చేశారని, అది చాలదన్నట్లు ఇప్పుడు తాజాగా టీడీపీ కార్యకర్త తప్పుడు ఫిర్యాదుతో మరోసారి అరెస్ట్ చేశారని తెలిపారు. సురేష్ ఇంటి వద్ద రాజు అనే టీడీపీ కార్యకర్త హల్‌చల్ చేసి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించాడని, కార్లను ధ్వంసం చేసి వీరంగం సృష్టించినా కనీసం పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. కానీ హల్‌చల్ చేసిన టీడీపీ కార్యకర్త రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీకో న్యాయం.. వైఎస్సార్ సీపీకో న్యాయమా? అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రహించాలని జయపాల్ పేర్కొన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీరు దళితుల పైన చూపిస్తున్న ప్రేమ ? అంటూ మండిపడ్డారు. ఇప్పటికై నా అక్రమ అరెస్ట్‌లు మానుకోకపోతే ప్రజలే భవిష్యత్తులో తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.
విద్యుత్ పోల్ పైనుంచి పడి షిఫ్ట్ ఆపరేటర్ మృతి
నరసరావుపేట రూరల్: మండలంలోని ఉప్పలపాడు కరెంట్ ఆఫీస్‌లో షిఫ్ట్ ఆపరేటర్ పనిచేస్తున్న రఫీ కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. విద్యుత్ పోల్ మీద పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పోల్‌పై నుంచి కింద రాయిమీద పడటంతో తీవ్రగాయాలకు లోనై మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి అదృశ్యం
మూడు రోజులుగా లభించని ఆచూకీ
కారంచేడు: కారంచేడు పాలేటివారి బజారుకు చెందిన ఒక విద్యార్థి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఎప్పుడూ ఇల్లు కదలని విద్యార్థి అదృశ్యం కావడంపై పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మీనిగ జయప్రకాష్‌కు ఇద్దరు కుమారులు.. రెండో కుమారుడు మీనిగ సామ్యేల్ ప్రణీత్ చీరాలలోని ఒక ప్రైవేటు స్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటి వద్దనే ఉంటున్న బాలుడు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి ఇంటి వద్ద నుంచి కనిపించడం లేదని బంధువులు తెలిపారు. మూడు రోజులుగా బంధువులు, స్నేహితుల వద్ద విచారించామని వారు చెబుతున్నారు. ఆదివారం తాను వాడుతున్న సైకిల్ పర్చూరు గ్రామంలోని ఉప్పుటూరు వంతెన వద్ద స్టాండ్ వేసి ఉండటం గమనించామని పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఆచూకీ తెలిసిన వారు 9515640934, 9542618260 నంబర్లకు తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
హెచ్‌ఐవీ,ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
బాపట్ల: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టరు విజయమ్మ చెప్పారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో 42వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే –2025 కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. మహిళలు క్యాండిల్ ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులకు భరోసా కల్పించేందుకు ఈ ప్రదర్శన దోహద పడుతుందని తెలిపారు.హెచ్‌ఐవీ,ఎయిడ్స్ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేపడుతోందని తెలిపారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి షేక్ మొహమ్మద్ సాదిక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం

మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం