21న డీఈఓ కార్యాలయం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

21న డీఈఓ కార్యాలయం ముట్టడి

May 19 2025 2:22 AM | Updated on May 19 2025 2:22 AM

21న డీఈఓ కార్యాలయం ముట్టడి

21న డీఈఓ కార్యాలయం ముట్టడి

ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వెల్లడి

గుంటూరు ఎడ్యుకేషన్‌: విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 21న గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు ఐక్య వేదిక నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లా కోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు జిల్లా స్టీరింగ్‌ కమిటీ బాధ్యుడు కె.బసవలింగారావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. బసవలింగారావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యారంగానికి గొడ్డలి పెట్టువంటి 117 జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అంత కంటే ప్రమాదకరమైన జీవోలు 19, 21 ద్వారా తొమ్మిది రకాల పాఠశాలల వ్యవస్థను రూపొందించాలని పూనుకోవడం ఉపాధ్యాయ లోకాన్ని మోసం చేయడమేనని అన్నారు. తక్షణమే 19, 21 జీవోల ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు ఉండాలని ఫౌండేషన్‌ పాఠశాలల ఏర్పాటు నిర్ణయాన్ని అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా పునరుద్ధరించాలని, ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషలోనే బోధన ఉండాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖామంత్రి లోకేష్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెడతామని, ఉన్నత పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు వెనక్కి తీసుకు వచ్చి పూర్వ స్థితికి పాఠశాల వ్యవస్థ ను నెలకొల్పుతామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐక్యవేదిక నాయకుడు ఎం.కళాధర్‌, డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఐక్యంగా తిరుగుబాటు చేయకుండా ఉండేందుకు బదిలీల్లో ఒక్కొక్కరికి ఒక్కో సమస్యను సృష్టించిన ప్రభుత్వం అనుసరిస్తున్న విభజించు, పాలించు కుట్రను ఉపాధ్యాయులు చైతన్యంతో ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసి ఉద్యమ శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఎస్జీటీలను ఇవ్వాలని, విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20గా ఉండాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో 1:43 గా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఉండాలన్నారు. బేసిక్‌, మోడల్‌ ప్రాథమిక పాఠశాలలు తప్ప ఫౌండేషన్‌ పాఠశాలల ఏర్పాటు దిశగా ప్రభుత్వం మొండిగా ముందుకెళితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌ మాన్యువల్‌ విధానంలోనే నిర్వహించాలని, రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా స్పందించి పరిష్కరించకపోతే ఈనెల 21న డీఈఓ కార్యాలయం ముట్టడి తరువాత 23న విద్యాభవన్‌ను ముట్టడించి స్తంభింపచేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా నాయకులు జీవీరాజు, యు.రాజశేఖరరావు, మహమ్మద్‌ ఖాలీద్‌, కె.శ్రీనివాసరావు, కొండయ్య, రెహమాన్‌, పల్నాడు జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి, బాపట్ల జిల్లా ప్రతినిధులు ఎ. శ్రీనివాసరావు, జ్ఞానేశ్వరరావు, మూర్తి, లక్ష్మీనారాయణ, జి.వెంకటేశ్వరరావు, దాస్‌, శివన్నారాయణ, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీపతి, బాలచంద్రారెడ్డి, కుమార్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement