
సాయం చేయబోయి మృత్యు ఒడికి రైతు
కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు
పెదకూరపాడు: తోటి రైతుకు సాయంగా వెళ్లి ప్రమాదానికి గురైన రైతు కథ విషాదంగా ముగిసింది. చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని అచ్చంపేట నుంచి పెదకూరపాడు తీసుకొచ్చే క్రమంలో లగడపాడు వద్ద ప్రమాదం జరిగింది. ఇందులో తీవ్ర గాయాలైన పెదకూరపాడు వాసి గోరంట్ల బ్రహ్మయ్య (33)గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ‘‘మాతృ దినోత్సవం రోజే నా మాంగల్యం తీసుకెళ్లావా... దేవుడూ.. నీకు కనికరం లేదా ! మంచానికే పరిమితమైన అత్తామామలు, బిడ్డలను ఎలా సాకాలయ్యా !’’ అంటూ భార్య మల్లిక విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ‘‘సాయానికి వెళ్లి సామి దగ్గరకు వెళ్లావా నాన్నా !’’అంటూ కుమారుడు మణికంఠ, కుమారై సుక్షలు గుండెలు అవిసేలా విలపించారు. అందరితో కలవిడిగా తిరిగే బ్రహ్మయ్య మృతితో పెదకూరపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.