కమలాన్ని తొక్కేస్తున్న సైకిల్‌ | Sakshi
Sakshi News home page

కమలాన్ని తొక్కేస్తున్న సైకిల్‌

Published Thu, May 9 2024 8:45 AM

-

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్డీఏ గెలుపు కోసం సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విజయవాడలో రోడ్‌ షోకు హాజరయ్యారు. ఈ రోడ్‌షోను విజయవంతం చేయడం కోసం ఎన్టీఆర్‌ జిల్లాతో పాటు పక్కనే ఉన్న గుంటూరు జిల్లా నుంచి కూడా ప్రజలను తరలించాలని నిర్ణయించారు. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం మిత్ర ధర్మాన్ని పక్కనపెట్టి పక్కనే ఉన్న మంగళగిరిలో ప్రచార కార్యక్రమాలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్‌ మంగళగిరి అభ్యర్థిగా పోటీలో ఉండటంతో తెలుగుదేశం నేతలు మోదీ కార్యక్రమానికి డుమ్మా కొట్టి మంగళగిరిలో వరుసగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో కమలనాథులు మిత్రధర్మం పాటించని టీడీపీ నేతలపై మండిపడుతున్నారు.

● మంగళగిరి నియోజకవర్గంలో బుధవారం టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారాలోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మణి, గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌లు చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మంగళగిరిలోని పలు డివిజన్‌లలో పర్యటనతోపాటు, కాజా, చినకాకాని, ఆత్మకూరు, గ్రామాల్లో కూడా టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదంతా మోదీ రోడ్‌షో చేసే సమయంలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని బీజేపీ నేతలు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సర్క్యులేట్‌ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మిత్ర ద్రోహానికి పాల్పడుతోందని వారికి తగిన బుద్ధి చెప్పాలంటూ తమ సొంత గ్రూపుల్లో మెసేజులు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలకు కేవలం జనసేన, తెలుగుదేశం జెండాలు మాత్రమే ప్రదర్శిస్తూ బీజేపీ జెండాలు పక్కన పడేయడంపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. మరోపక్క ప్రచార కార్యక్రమాలకు సైతం బీజేపీ నేతలను ఆహ్వానించకుండా అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందిని ప్రచారాలకు పిలిచినా కేవలం ఉత్సవ విగ్రహాల మాదిరిగా బీజేపీ నేతలను కూర్చొబెడుతున్నారు తప్పితే ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటున్నారు.

ప్రధాని రోడ్‌షో సమయంలో మంగళగిరిలో టీడీపీ నేతల ప్రచారం టీడీపీ నేతలపై మండిపడుతున్న కమలనాథులు

Advertisement
Advertisement