కోర్టుల సంఖ్య పెంచాలి.. ఎందుకంటే!

There One Judge for Every 50000 Citizens in India, Increase Courts - Sakshi

ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోకసభలో, దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, పొలీసు కస్టడీలోని నిందితులు 2016 నుండి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. పొలీసు కస్టడీలో 7 శతం, జైళ్లలో 93 శతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యతవహించి సంబంధిత కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. భాద్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సంబంధిత మరణాలు సహజ, అసహజ, అనారోగ్య, పొలీసు ఎన్కౌంటర్లు, పోలీసుల చిత్ర హింసలు, జైళ్లలో తోటి ఖైదీలు చంపడం వంటి మొదలగు కారణాలని తెల్పింది. ఆధునిక భారతావనిలో దినదినం పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి.
 
దేశవ్యాప్తంగా 672 న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు విచారణ దశలో పెండింగులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సుప్రీమ్ కోర్టులో 71 వేలు, హైకోర్టుల్లో 59 లక్షలు మిగితావి క్రింది స్థాయి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో పెండింగులో ఉన్నాయి. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చిచూసినప్పుడు ప్రతి 50 వేలమంది పౌరులకు కేవలం ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. దేశంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య 25 వేలు ఇందులో, ఎప్పుడూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటాయి. 1987లో లాకమీషన్ ప్రతీ 20 వేలమంది పౌరులకు ఒక్క న్యాయమూర్తిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ దేశాల న్యాయవ్యవస్థను పోల్చిచూసినప్పుడు చైనాలో ప్రతీ 3500 మంది పౌరులకు ఒక్క న్యామూర్తి, అమెరికాలో ప్రతీ 7,000 మంది పౌరులకు ఒక్క న్యాయ మూర్తి చొప్పున నియమించారు అందుకే, ఆయా దేశాల్లో పౌరులకు సత్వర న్యాయం లభిస్తుంది.
     
దేశంలోని 1350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు, శిక్షలు ఖరారైన వాళ్లు మరియు విచారణలో కొనసాగుతున్న వాళ్లు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని, ఇటీవల సుప్రీంకోర్టు సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్య జరిగిన కేసు తీర్పులో, నేరాలను నాలుగు రకాలుగా విభజించి పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేస్తూ, నిందితులు చేసిన నేరానికి విధించే శిక్షలో 50 శాతం జైళు జీవితాన్ని పూర్తిచేసి జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలను వెంటనే బేయిలుపై  విడుదల చెయ్యాలని అన్ని మేజిస్ట్రేట్, జిల్లా, హైకోర్టులను ఆదేశించింది.
 
భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, కొంత మంది పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, బ్రిటిష్ కాలంనాటి మూస పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పోలీసులు నిందితులను, నిందితులుగా చూడకుండా నేరస్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టు ముందు హాజరపరిచి విచారణలో, వారు నేరం చేసినట్లుగా తగు సాక్ష్యాధారాలతో న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాంగం చూపించవలసి ఉంటుంది. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్తులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి.      
     
దేశంలో సుమారు 4 లక్షల 88 వేలకు పైగా విచారణ ఖైదీలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవితం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు?. వీరిలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా పేదవారే ఉండడం గమనించతగ్గ విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే. దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో  ఖైదీలకు పౌష్ట ఆహారం, మెరుగయినా వైద్య సదుపాయాలు అందించాలి. అప్పుడే కస్టోడియల్ మరణాలు తగ్గి, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హాక్కును రక్షించనివారిగా పాలకులు చరిత్రలో నిలిచిపోతారు.  

అదే సమయంలో దేశంలోని పౌరులకు విద్యార్థి దశ నుండి పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, నేరాలపై, కేసుల నమోదు ప్రక్రియ నుండి న్యాయవ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యా బోధనలో నేర్పించాలి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులపై, అవే క్రిమినల్ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి యువకులు, ప్రజలు ఎదుగవలసి ఉంది. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!)


– కోడెపాక కుమార స్వామి, హైదరాబాద్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top