
సింగోడీ హల్వా
కావలసినవి: కోవా– 2 కప్పులు, బెల్లం తురుము– రుచికి సరిపడా
బాదం పొడి– 2 టేబుల్ స్పూన్లు (బాదం దోరగా వేయించి, పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి), పచ్చికొబ్బరి తురుము– పావు కప్పు, ఏలకుల పొడి– అర టీ స్పూన్, బాదం– గార్నిష్ కోసం (నేతిలో వేయించాలి)
తయారీ: కోవాను మెత్తగా చేత్తో బాగా కలిపి, ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో కోవా, ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము వేసి చిన్న మంట మీద పెట్టి, గరిటెతో కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగి, కోవాలో కలిసిపోయిన తర్వాత, పచ్చి కొబ్బరి తురుము, బాదం పొడి వేసి బాగా కలపాలి. తీపి సరిపోయిందో లేదో చూసుకుని, మరికాస్త బెల్లం తురుము వేసుకోవచ్చు.
మళ్లీ వేసుకున్న బెల్లం తురుము బాగా కరిగి, ఈ మిశ్రమమంతా చిన్నమంట మీద బాగా ఉడకాలి. తర్వాత ఏలకుల పొడి వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మి్రÔè మం కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకుని, వేయించిన బాదంతో కలిసి సర్వ్ చేసుకోవచ్చు.
టేస్టీ మీల్‌మేకర్ బాల్స్
కావలసినవి: మీల్‌మేకర్– 2 కప్పులు పైనే (శుభ్రం చేసుకుని, మెత్తగా ఉడికించి, తురుములా చేసుకోవాలి), గోధుమ పిండి– 3 టేబుల్ స్పూన్లు, గడ్డ పెరుగు– సరిపడా, ఉల్లిపాయ గుజ్జు– 2 టేబుల్ స్పూన్లు (నూనెలో దోరగా వేయించుకుని చల్లారనివ్వాలి), కారం, గరం మసాలా– 2 టీ స్పూన్లు చొప్పున, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, అల్లం తురుము– పావు టీ స్పూన్ చొప్పున, ఉప్పు– తగినంత, స్ప్రింగ్ రోల్ షీట్స్ – 2 (బాగా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో మీల్‌మేకర్ తురుము, కారం, గోధుమ పిండి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం తురుము, వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, ఉల్లిపాయ గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని బాగా కలపాలి. అవసరం అయితే మరింత పెరుగు కలుపుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ప్రతి ఉండకు కొద్దికొద్దిగా స్ప్రింగ్ రోల్ షీట్స్ ముక్కలను చిత్రంలో ఉన్నవిధంగా చుట్టి, బాగా ఒత్తి, నూనెలో దోరగా వేయించి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
కొరియన్ ఫ్రైడ్ పొటాటో
కావలసినవి: పెద్ద బంగాళదుంపలు– 3 (తొక్క తీసి, పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు– ఒక టేబుల్ స్పూన్ (సన్నగా, పొడవుగా తరగాలి), పచ్చిమిర్చి ముక్కలు– కొద్దిగా, వెల్లుల్లి తురుము– రెండు టీ స్పూన్లు, టమాటో సాస్, సోయా సాస్– 5 టేబుల్ స్పూన్లు చొప్పున, క్యారట్– ఒకటి (సన్నగా కట్ చేసుకోవాలి), పంచదార, నూనె– సరిపడా, నువ్వులు– ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు– కొన్ని(గార్నిష్‌కి)
తయారీ: ముందుగా బంగాళదుంప ముక్కలను నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో కళాయిలో కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, క్యారట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని, దోరగా వేయించుకుని, ఆ తర్వాత వెల్లుల్లి తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. వెంటనే వేగిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని కలపాలి.
ఈలోపు ఒక చిన్న బౌల్‌లో సోయా సాస్, టమాటో సాస్, పంచదార వేసుకుని బాగా కలిపి, వేగుతున్న మిశ్రమంలో వేయాలి. ఆపై నువ్వులు జల్లి బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసి, సర్వ్ చేసుకోవచ్చు.