
‘నావల్ ఏవియేషన్‌లో కొత్త అధ్యాయం మొదలైంది’ అని సగర్వంగా, సంతోషంగా ప్రకటించింది భారత నౌకాదళం. లింగ సమానత్వం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళుతున్న భారత నౌకాదళం మరో చారిత్రక ఘట్టానికి తెర తీసింది. భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా చరిత్ర సృష్టించింది...
తొలి స్వాతంత్య్ర పోరుకేక వినిపించిన ప్రాంతంగా మీరట్‌కు చరిత్రలో ప్రత్యేకస్థానం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఆస్తా పూనియా ఎందరో ఫ్రీడమ్ ఫైటర్‌ల గురించి విని ఉండవచ్చు.
ఇప్పుడు తానే ఒక ఫైటర్ (పైలట్)గా చరిత్ర సృష్టించింది. నావిక విమానయానం (నావల్ ఏవియేషన్)లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అనేది లక్ష్యంగా ఉంటుంది. నావిక విమాన యానంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థుల శక్తిసామర్థ్యాలు, అంకితభావానికి ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం ప్రధాన మైలురాయి.
విశాఖపట్టణంలో జరిగిన ఐఎన్‌ఎస్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అవార్డు అందుకుంది ఆస్తా పూనియా. పూనియాకు ఎలాంటి సైనిక కుటుంబ నేపథ్యం లేదు. బీటెక్ చేసిన తరువాత నేవీకి ఎంపికైంది. ఫైటర్‌గా భవిష్యత్‌లో మిగ్–28,కె నౌకాదళ రఫెల్ యుద్ధ విమానాలను ఆస్తా పూనియా నడిపే అవకాశం ఉంది. ఇప్పటివరకు మహిళా అధికారులు భారత నావికాదళంలో పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌లుగా సముద్ర నిఘా విమానాలు, హెలికాప్టర్‌లలో విధులు నిర్వహిస్తున్నారు.
నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళగా పూనియా చరిత్ర సృష్టించింది. ‘నౌకాదళ వైమానిక విభాగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే నిబద్ధతకు ఈ చారిత్రక ఘట్టం అద్దం పడుతుంది. ఆస్తా పూనియా అనేక అడ్డంకులను అధిగమించి నూతన శకానికి నాంది పలికింది’ అని ‘ఎక్స్’ వేదికగా భారత నౌకాదళం ప్రకటించింది.
త్రివిధ దళాలలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2016లో తొలిసారిగా మహిళలను ఫైటర్ స్ట్రీమ్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫైటర్‌లు ‘ఐఏఎఫ్’లో రాఫెల్, సు–30ఎంకెఐ, మిగ్–29ఎస్ నడుపుతున్నారు. ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో మేజర్ అభిలాష ఫస్ట్ ఉమెన్ కాంబాట్ ఏవియేటర్‌గా చరిత్ర సృష్టించింది.
2023లో తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్‌ను నియమించి భారత నౌకాదళం చారిత్రక నిర్ణయం తీసుకుంది. 2020 నుంచి భారత నౌకాదళంలో మహిళా అధికారుల నియామకం 15 శాతం పెరిగింది. త్రివిధ దళాలలో గత కొన్ని సంవత్సరాలుగా మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, లింగ సమానత్వం వైపు వేస్తున్న అడుగులు చూస్తుంటే ‘అన్నీ మంచి శకునములే’ అనిపిస్తోంది.
వింగ్స్ ఆఫ్ గోల్డ్
‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అనేది నౌకాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన పురస్కారమే కాదు... ప్రతిష్ఠాత్మకమైన పుస్తకం కూడా! యూఎస్ నావల్ ఏవియేషన్‌లో చరిత్ర సృష్టించిన ఆరుగురు మహిళల గురించి రాసిన పుస్తకం ఇది (వింగ్స్ ఆఫ్ గోల్డ్–ది స్టోరీ ఆఫ్ ది ఫస్ట్ ఉమెన్ నావల్ ఏవియేటర్స్) నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడపడంలో మహిళలకు శిక్షణ ఇవ్వాలని నావల్ ఆపరేషన్స్ చీఫ్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్నో వెక్కిరింపు మాటలు వినిపించాయి.
‘వారు నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా సైన్యంలో పనిచేయలేరు’ అనే మాట బలంగా వినిపించింది. ఇలాంటి పురుషాధిపత్య భావజాలాన్ని తుత్తునియలు చేస్తూ ఈ ఫైటర్ పైలట్‌లు దూసుకెళ్లారు. చరిత్రలో నిలిచిపోయారు. బార్బరా ఆలెన్ రైని ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అవార్డ్ అందుకున్న తొలి మహిళ.
ఆమె సి–1 ట్రేడర్, టి–39 శేబర్లినర్‌లాంటి యుద్ధ విమానాలను నడిపేది. అమెరికా నావికాదళానికి సంబంధించి తొలి మహిళా ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌లలో ఆమె ఒకరు. 1982లో ఒక ట్రైనింగ్ ఫ్లైట్ ప్రమాదంలో మరణించింది.
(చదవండి: