అభిజిత్‌ ముహూర్తం... అంటే ఏమిటి?

Sri Rama Navami 2022: What Is Abhijit Muhurtham Its Significance - Sakshi

మనకు అభిజిత్‌ ముహూర్తం అనే మాట శ్రీరామ నవమి సమయంలోనే ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకీ అభిజిత్‌ ముహూర్తం అంటే ఏమిటి? రాముడు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు జన్మించాడు. దీనినే అభిజిత్‌ లగ్నమనీ, అభిజిత్‌ ముహూర్తమనీ అంటారు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని పండుగగా జరుపుకుంటారు.

చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి వసంతోత్సవం తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగ రోజు ఉదయాన్నే సూర్యుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభం అవుతుంది.

శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. అందుచేత శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహం పొందిన వారమవుతాం. అంతేగాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top