
ఆ అమ్మాయి వయస్సప్పుడు 13 ఏళ్లు. ప్రపంచమంటే ఎంతో ఇష్టం. గుస్తాద్ బోర్జర్జీ అహ్మదాబాద్‌లో నివసిస్తున్న ఓ వృద్ధుడు. టాటా ఇండస్ట్రీస్ ఒకప్పటి ఉద్యోగి. నా అనేవారు ఎవరూ లేని గుస్తాద్‌తో ఎందుకింత బంధం ఏర్పడిందో తెలీదు. ఇప్పుడు అమీషాకు గుస్తాద్ తాత. ఆమె అతని మనవరాలు. తల్లిదండ్రుల కన్నా మిన్నగా ప్రేమించి, లాలించిన గుస్తాద్ తాత ఇప్పుడు లేడు. కానీ ఆయన ప్రేమ మాత్రం అమీషా ఇంకా అనుభూతి చెందుతూనే ఉంది. అహ్మదాబాద్ కోర్టు నిర్ణయంతో ఇప్పుడా తాతా మనవరాలి కథ వెలుగులోకి వచ్చింది.
గుస్తాద్ టాటా ఇండస్ట్రీస్‌లో పనిచేశాడు. ఆయనకు సంతానం లేదు. భార్య కూడా మరణించింది. వృద్ధాప్యాన్ని భారంగా, ఒంటరిగా గడుపుతున్న కాలంలో ఆయన దగ్గర ఎంతోకాలంగా పనిచేస్తున్న వంటతని మనవరాలు అమీషా ఒక వెలుగురేఖలా ప్రసరించి అంతులేని కాంతులను వెంట తీసుకొచ్చింది. ‘తాయి’ అని పిలుస్తూ ప్రేమ, ఆప్యాయతలను పంచుతూ ఆయనకు దగ్గరైంది.
క్రమంగా ఆయన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగమయ్యింది. ఇద్దరూ గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవారు. ఆటపాటలతో ఉల్లాసంగా గడిపేవారు. ఒకానొక సమయంలో ఆమెను దత్తత తీసుకోవాలని కూడా ఆనుకున్నాడు గుస్తాద్. కానీ అది ఆమెను తల్లిదండ్రులనుంచి దూరం చేస్తుందని, ఆమె గుర్తింపును మార్చేస్తుందని అనిపించి ఆ ఆలోచనను మానుకున్నాడు. కానీ అమీషా కోసం ఏదైనా చేయాలి.
ఆమె తనకెంత ముఖ్యమో, ఆమె కోసం తానేం చేయగలడో ప్రేమపూర్వకంగా అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ఆ ప్రకారమే తాను లేకున్నా తన ప్రేమ, అనురాగం ఆమెను జాగ్రత్తగా కాపాడాలని అమీషాతో బంగారు జ్ఞాపకాలకు నిలయమైన అహ్మదాబాద్, షాహిబాగ్‌లోని తన ఫ్లాట్‌ను ఆమె పేరున రాశాడు. ఆ సమయంలో అమీషా మైనర్ కాబట్టి తన మేనల్లుడికి ఇంటి బాధ్యతలు అప్పగించాడు.
ఇప్పుడు అమీషా ఒక ప్రైవేటు కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పనిచేస్తోంది. తాత గుస్తాద్ చివరి కోరికను అధికారికంగా నెరవేర్చేందుకు కోర్టును ఆశ్రయించింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయాల్సిందిగా కోరింది. అయితే అదృష్టవశాత్తూ అలాంటివేమీ తలెత్తలేదు. గుస్తాద్ స్వంత సోదరుడు కూడా అమీషాకు ఆ ఇంటిని అప్పగించడానికి మనస్పూర్తి గా అంగీకరించారు. దీంతో ఈ నెల 2న కోర్టు అధికారికంగా ఫ్లాట్‌ను ఆమె పేర బదిలీ చేసింది. ఈ సందర్భంగా అమీషా గుస్తాద్‌తాతతో తన అనుబంధాన్ని మీడియాతో ఆనందంగా నెమరు వేసుకుంది.
(చదవండి: మ్యారేజ్ గ్రాడ్యుయేషన్..! విడిపోయి కలిసి ఉండటం..)