
సాంకేతికత నుంచి జీవనతత్వం దాకా ఎందులోనైనా ట్రెండ్‌ను క్రియేట్ చేయడంలో పేటెంట్ జపాన్‌దే! ఆ ధోరణి పెళ్లి బంధంలోనూ కనిపిస్తోంది. దాన్ని మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ అంటున్నారు. అదే జాపనీస్‌లో ‘సోసుకోన్’. సోసుగ్యోయు అంటే గ్రాడ్యుయేషన్.. కేకోన్ అంటే పెళ్లి.. ఈ రెండు పదాల కలయికే సోసుకోన్.
మనసున మనసై బతుకున బతుకైన జీవన తోడు దొరకడం నిజంగానే భాగ్యం. ఆ భాగ్యం లేక΄ోతే సర్దుబాట్లతోనే సంసారం సాగుతుంది. ఆ సర్దుబాటూ కరవైతే విడాకులే! ఆ విడాకులూ ఊరికే మంజూరు కావు కదా.. ఆలుమగల గోల వినాలి.. సాక్ష్యాలు పరీక్షించాలి.. వాయిదాలు భరించాలి.. మానసిక క్షోభను అనుభవించాలి! ఇదంతా లేకుండా విడి΄ోయి కలిసి బతికే దారి ఉంటే బాగుండు అనిపిస్తుంది! అచ్చంగా అలాంటి పరిష్కార మార్గమే సోసుకోన్ ఆకా (ఏకేఏ ఆల్సో నోన్ యాజ్) మ్యారేజ్ గ్రాడ్యుయేషన్. కలహాల కాపురానికి చక్కటి సొల్యుషన్ అంటున్నాయి జపాన్ జంటలు.
ఆ సొల్యుషన్ ఏంటంటే..
పెళ్లిని పునర్నిర్వచిస్తున్న ఈ ట్రెండ్ స్పర్ధలున్న భార్యాభర్తలు ఏ గొడవలేకుండా, విడాకుల ఊసెత్తకుండా పరస్పర గౌరవంతో ఎవరికివారే నచ్చినట్లు జీవించే వెసులుబాటును కల్పిస్తోంది. ఆ జంట ఇష్టపడితే విడి΄ోయి కూడా ఎవరిమానాన వారు ఒకే చూరు కింద కలిసి ఉండొచ్చు. ఇంటి పనుల దగ్గర్నుంచి వంట దాకా సపరేట్‌గా చేసుకుంటూ హౌజ్‌మేట్స్‌లా గడపొచ్చు లేదంటే వేరువేరుగా వేరు వేరు ఇళ్లల్లో ఉండొచ్చు..
నచ్చినప్పుడు, సమయం కుదిరినప్పుడు కాఫీ, లంచ్, డిన్నర్, మూవీ డేట్స్‌కి కలుసుకుంటూ! ఫ్రెండ్స్‌లా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు.. కెరీర్ నుంచి ఆస్తుల వ్యవహారాల దాకా ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. డబ్బు, సమయం వృథాకాని.. మానసిక బాధలేని ఈ పద్ధతి జపాన్‌లోని చాలా జంటలకు నచ్చి.. కలహాలతో కాపురం డిస్టర్బ్ అవుతుందనే అంచనాకు రాగానే వెంటనే మ్యారేజ్ గ్రాడ్యుయేషన్‌ను అమలు చేస్తున్నారట.
ఎప్పుడు మొదలైందంటే..
జపనీస్ ప్రఖ్యాత రచయిత యుమికో సుగియామా 2000 సంవత్సరంలో పెళ్లయిన జంటల మీద ఒక సర్వే నిర్వహించింది. విడాకులకు వెళ్లకుండా వైవాహిక జీవితంలోని కలతలను ఎలా పరిష్కరించుకుంటారని అడిగింది. అందులో సగానికి పైగా జంటలు అలాంటి అవకాశమే వస్తే.. సొసుకోన్ మెథడ్‌ను ఎంచుకుంటామని చెప్పారు.
ఒకే ఇంట్లో ఉంటూ తమకు నచ్చినట్టు బతుకుతామని కొందరు, వేరువేరుగా ఉంటూ వీకెండ్ డేట్స్‌లో మీట్ అవుతామని మరికొందరు, ఫ్రెండ్స్‌లా కలిసి ఉండటానికి ఇష్టపడతామని ఇంకొందరు చెప్పారట. అలా రెండువేల సంవత్సరంలో ఆ సర్వే ద్వారా మ్యారేజ్ గ్రాడ్యుయేషన్ ప్రచారంలోకి వచ్చి.. విడాకులకు ప్రత్యామ్నాయమైన ట్రెండ్‌గా స్థిరపడిపోయింది. హింస, వ్యథ లేని ఆ రిలేషన్‌షిప్‌ను నలభైల్లో ఉన్న జంటలు ఎక్కువగా ఇష్టపడతున్నాయని తర్వాత జరిగిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.