
ఈ మధ్య కాలంలో ఓ మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్‌తో పట్టుబడి వార్తలకెక్కడంతో కొకైన్‌పై చర్చ మరోసారి బయలుదేరింది. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు, రెండు లేదా మూడు నిమిషాల్లో మెదడులో స్వైరకల్పనలు మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోనూ అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకేసారి తీసుకోగలరు.
అంతకుమించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు-బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజూ 5 గ్రాముల దాకా విడతలు, విడతలుగా తీసు కునే వారి శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. కిడ్నీలు, ప్రేవులు, ఊపిరితిత్తులు నాశనమవుతాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడై మానసిక భ్రాంతులు కలగడం, వణుకు రావడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు... ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణంగా కొకైన్‌ని ముక్కుతో పీల్చడం, ఇంజెక్ట్ చేసుకోవడం, సిగరెట్లలో పెట్టి కాల్చడం వంటి పద్ధతుల్లో తీసు కుంటారు. తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి.
కోకా ఆకులు నుంచి కొకైన్‌ని తయారు చేస్తారు. కొలంబియా, పెరూ, బొలీవియా వంటి దేశాల్లో ఈ కోకా పంట విరివిగా పండుతుంది. మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకుగా ఉండటానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు. అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లో నుంచి రసాన్ని పిండి, దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860లో తయారు చేశాడు. ఆ విధంగా ఇప్పుడు మనం చూసే కొకైన్ పుట్టింది.
ఒక కిలోగ్రామ్ కొకైన్ తయారు చేయాలంటే వెయ్యి కిలో గ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు. ప్రపంచంలోని మొత్తం కొకైన్‌లో 70 శాతం పైగా ఒక్క కొలంబియాలోనే తయారవుతుంది. ఆ తర్వాత స్థానం పెరూ, బొలీవియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి 400 మిలియన్ డాలర్లు ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించింది.
– మూర్తి కేవీవీఎస్