
ఎమిలిన్ తండ్రి జోస్ థామస్ లెక్కల టీచర్. ఎంత జటిలమైన లెక్క అయినా సరే... చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు ఆయన. ఎమిలిన్‌కు ఆ లక్షణం వచ్చిందో లేదో తెలియదు గానీ తాను మాట్లాడితే దృశ్యాలు కళ్లకు కడతాయి. సమస్యల మూలాలను తడుముతాయి. పరిష్కార మార్గాలు ఆలోచించేలా చేస్తాయి...
అమెరికాలో భారత సంతతికి చెందిన పదిహేడేళ్ల ఎమిలిన్ రోజ్ థామస్ పెన్సిల్వేనియాలోని మౌంట్ సెయింట్ జోసెఫ్ అకాడమీ హైస్కూల్ స్టూడెంట్. ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికపై పిల్లల హక్కుల గురించి ఆమె చేసిన ప్రసంగానికి అద్భుతమైన స్పందన లభించింది.
తన ప్రసంగంలో స్పెషల్ నీడ్స్ కిడ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన తమ్ముడు స్పెషల్ నీడ్ కిడ్ కావడంతో తనకు వారి ప్రపంచం గురించి ప్రత్యక్షంగా తెలుసు.
‘తమ్ముడి విషయంలో అమ్మ, నాన్న, నేను ఒక్కటై కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని సోదరుడి గురించి చెప్పింది ఎమిలిన్.
‘స్పెషల్ నీడ్స్ కిడ్స్‌కు అమెరికాలాంటి దేశాల్లో మంచి హెల్త్ ఇన్సూరెన్స్‌లు, అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. కాని చాలా దేశాల్లో ఈ పరిస్థితి లేదు. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నువ్వు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి...అనేవాటితో సంబంధం లేకుండా ప్రతివ్యక్తికి హైక్వాలిటీ కేర్ అందాలి’ అంటుంది ఎమిలిన్.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎమిలిన్‌ను ప్రత్యేకంగా పిలిపించుకొని ప్రశంసించారు. చాలాసేపు మాట్లాడారు. తన ఆసక్తుల గురించి తెలుసుకున్నారు. పర్యావరణం నుంచి న్యూరోసైన్స్ వరకు రకరకాల అంశాలపై వీరు మాట్లాడుకున్నారు.
‘పీడియాట్రిక్స్ డాక్టర్ కావాలనేది నా కల’ అని చెప్పింది ఎమిలిన్. ఇది విని కమల సంతోషించడమే కాదు తనకు ‘ది డీపెస్ట్ వెల్’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. పిల్లల మానసిక ఆరోగ్యం గురించి డా.నదిన్ బుర్కే హారిస్ రాసిన ఈ పుస్తకం ద్వారా ఎమిలిన్ చాలా విషయాలు తెలుసుకోగలిగింది.
అందుకు ఈ పుస్తకాన్ని గొప్ప కానుకగా భావిస్తుంది. ‘ఆమెను కలుసుకోవాలనే నా కోరిక నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నా సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఆరోజు వాతావరణం చాలా బాగుంది. ఆ రోజు నేను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని రోజు’ అంటుంది ఎమిలిన్.
చదవండి: Russia-Ukraine: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా?