
∙ఇస్లాం వెలుగు
జీవితం విభిన్న స్థితుల సంగమం. ఇక్కడ సుఖమూ ఉంది, దుఃఖమూ ఉంది. సంతోషమూ ఉంది, బాధా ఉంది. ఆనందమూ ఉంది, విచారమూ ఉంది. తీపీ ఉంది, చేదూ ఉంది. శీతలమూ ఉంది, ఉష్ణమూ ఉంది. సంతృప్తీ అసంతృప్తీ రెండూ ఉన్నాయి. శాంతి, అశాంతీ కూడా ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం, దేవుని ఆదేశానుసారం, ఆయన నిర్ణయం మేరకే.
అందుకని మానవులు కష్టాలొచ్చినప్పుడు కుంగి΄ోకూడదు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు. ధైర్యంతో స్వాగతం పలకాలి. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి.
ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగి΄ోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే ఇదంతా తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు. ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసం హృదయంలో జనించాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. ముహమ్మద్ ప్రవక్త(స)ప్రవచనం ఇలా ఉంది: ‘ఎవరైతే ధన, ప్రాణ నష్టాల్లో కూరుకు΄ోయి, ఆ విషయం ఎవరి ముందూ బహిర్గతం చేయకుండా, ప్రజలతో ఫిర్యాదు చేయకుండా ఉంటాడో అతణ్ణి క్షమించడం అల్లాహ్ బాధ్యత.’
అల్లాహ్ ఇలా అంటున్నాడు: ‘మానవులారా! నా ప్రసన్నత కోసం, నేను ప్రసాదించే పుణ్యాన్ని ΄పొందే సంకల్పంతో, దుఃఖ సమయం ఆసన్నమైనప్పుడు సహనం వహించినట్లయితే, నేను స్వర్గంకన్నా తక్కువైనదాన్ని, స్వర్గం తప్ప మరిదేన్నీ మీకు ప్రసాదించడానికి ఇష్టపడను.’
ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటిద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ్ర΄ాప్తమైనప్పుడు అల్లాహ్‌కు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే దాస్య ఔన్నత్యానికి ప్రతిరూపంగా అనన్యసామాన్యమైన సహనం వహించాలి. హృదయం కృతజ్ఞతతో నిండి ఉండాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. దీన్నే ‘స్థితప్రజ్ఞత’ అంటారు. ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. స్వర్గసీమను అనుగ్రహిస్తాడు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం!