
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో ఇంతకు ముందు నుంచే అనేక పంటల్లో జన్యుసవరణ (Genome Editing) సాంకేతికత ద్వారా సరికొత్త వంగడాల రూపకల్పన జరిగింది. అయితే, ప్రపంచంలోనే తొలి జన్యు సవరణ వరి వంగడాలను రూపొందించిన ఘనత భారత్‌కు దక్కింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన డిఆర్‌ఆర్ ధన్ 100 (కమల), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎఆర్‌ఐ) అభివృద్ధి చేసిన పూసా రైస్ డిఎస్‌టి1 (Pusa DST Rice 1) రకాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా విడుదల చేసింది. ఇవి 20–30% అధిక దిగుబడినివ్వటం, 20% తక్కువ నీటిని వినియోగించటం, 20 రోజులు ముందుగానే పంట కోతకు రావటం వంటి ప్రయోజనాలను చేకూర్చుతాయని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రకటించింది. మన దేశంలో మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను అభివృద్ధి చేయటంతో జన్యు సవరణ సాంకేతికత మరోసారి చర్చలోకి వచ్చింది.
పంట దిగుబడి అప్
సింథటిక్ బయాలజీ రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రసాయన ఎరువులను అధికంగా వాడటం ముఖ్యమైన సవాళ్లలో ఒకటి. ఇది పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నేలలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయగల సూక్ష్మజీవులను ఇంజనీరింగ్ చేయడం, మొక్కలకు పోషకాలను మరింత అందుబాటులోకి తేవటం, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించడం ద్వారా జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికత ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. తెగుళ్ళు, వ్యాధులు, కరువు లేదా విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి పర్యావరణ ఒత్తిళ్లకు ఎక్కువ నిరోధకత కలిగిన పంటలకు జన్యు సాంకేతికతతో రూపుకల్పన చేస్తున్నారు. ఇవి పంట దిగుబడిని మెరుగుపరుస్తాయి. పురుగుమందులు, ఇతర రసాయనాల వాడకాన్ని తగ్గిస్తాయి.
జంతు ఆధారిత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం
వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ (Synthetic biology) మరొక ఉత్తేజకరమైన ప్రయోజనం ఏమిటంటే.. సాంప్రదాయ జంతు ఆధారిత ఉత్పత్తులకు మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడం. మాంసం, పాల ఉత్పత్తులు, ఇతర జంతు ఆధారిత ఉత్పత్తుల రుచిని, ఆకృతిని అనుకరించే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి పరిశోధకులు మొక్కల జన్యు క్రమంలో సవరణలు/ చేర్పులు/ మార్పులు చేస్తున్నారు. వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ పరిధి అపారమైనది.
సింథటిక్ బయాలజీ సవాళ్లు
అయితే, దీనికి సవాళ్లు కూడా ఉన్నాయి. వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ వల్ల జన్యు భద్రత, అనాలోచిత విపరిణామాల గురించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఇతర సాంకేతికతల వలె సింథటిక్ బయాలజీకి సంబంధించి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఉపయోగాన్ని నిర్ధారించుకోవడానికి పూర్తిగా అధ్యయనం చేయాలి. జాగ్రత్తగా నియంత్రించాలి.
చదవండి: జన్యు సవరణ అంటే ఏంటి.. అదెలా చేస్తారు?