Genome Editing
-
వరి జన్యు సవరణలో మనమే ఫస్ట్
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో ఇంతకు ముందు నుంచే అనేక పంటల్లో జన్యుసవరణ (Genome Editing) సాంకేతికత ద్వారా సరికొత్త వంగడాల రూపకల్పన జరిగింది. అయితే, ప్రపంచంలోనే తొలి జన్యు సవరణ వరి వంగడాలను రూపొందించిన ఘనత భారత్‌కు దక్కింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల), ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసిన పూసా రైస్ డిఎస్టి1 (Pusa DST Rice 1) రకాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అధికారికంగా విడుదల చేసింది. ఇవి 20–30% అధిక దిగుబడినివ్వటం, 20% తక్కువ నీటిని వినియోగించటం, 20 రోజులు ముందుగానే పంట కోతకు రావటం వంటి ప్రయోజనాలను చేకూర్చుతాయని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ప్రకటించింది. మన దేశంలో మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను అభివృద్ధి చేయటంతో జన్యు సవరణ సాంకేతికత మరోసారి చర్చలోకి వచ్చింది. పంట దిగుబడి అప్సింథటిక్ బయాలజీ రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రసాయన ఎరువులను అధికంగా వాడటం ముఖ్యమైన సవాళ్లలో ఒకటి. ఇది పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నేలలోని సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేయగల సూక్ష్మజీవులను ఇంజనీరింగ్ చేయడం, మొక్కలకు పోషకాలను మరింత అందుబాటులోకి తేవటం, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించడం ద్వారా జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికత ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. తెగుళ్ళు, వ్యాధులు, కరువు లేదా విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి పర్యావరణ ఒత్తిళ్లకు ఎక్కువ నిరోధకత కలిగిన పంటలకు జన్యు సాంకేతికతతో రూపుకల్పన చేస్తున్నారు. ఇవి పంట దిగుబడిని మెరుగుపరుస్తాయి. పురుగుమందులు, ఇతర రసాయనాల వాడకాన్ని తగ్గిస్తాయి.జంతు ఆధారిత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంవ్యవసాయంలో సింథటిక్ బయాలజీ (Synthetic biology) మరొక ఉత్తేజకరమైన ప్రయోజనం ఏమిటంటే.. సాంప్రదాయ జంతు ఆధారిత ఉత్పత్తులకు మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడం. మాంసం, పాల ఉత్పత్తులు, ఇతర జంతు ఆధారిత ఉత్పత్తుల రుచిని, ఆకృతిని అనుకరించే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడానికి పరిశోధకులు మొక్కల జన్యు క్రమంలో సవరణలు/ చేర్పులు/ మార్పులు చేస్తున్నారు. వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ పరిధి అపారమైనది.సింథటిక్ బయాలజీ సవాళ్లుఅయితే, దీనికి సవాళ్లు కూడా ఉన్నాయి. వ్యవసాయంలో సింథటిక్ బయాలజీ వల్ల జన్యు భద్రత, అనాలోచిత విపరిణామాల గురించి కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఇతర సాంకేతికతల వలె సింథటిక్ బయాలజీకి సంబంధించి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఉపయోగాన్ని నిర్ధారించుకోవడానికి పూర్తిగా అధ్యయనం చేయాలి. జాగ్రత్తగా నియంత్రించాలి.చదవండి: జన్యు సవరణ అంటే ఏంటి.. అదెలా చేస్తారు? -
జన్యు సవరణ.. నియంత్రణలు, నిబంధనలు
జన్యు సవరణకు సంబంధించిన ఆధునిక బ్రీడింగ్ ఆవిష్కరణ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎటువంటి నియంత్రణ చట్టాలు, నియమనిబంధనలు అమల్లో ఉన్నదీ ఈ ఇన్ఫోగ్రాఫిక్ తెలియజెప్తోంది. ఈ దేశాలు జన్యు సవరణ వంగడాలను సాధారణ కొత్త వంగడాలుగానే పరిగణిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో చట్టాల్లో వచ్చిన మార్పుల వల్ల ఇది సాధ్యమైంది.సైట్ డైరెక్టెడ్ న్యూక్లియాసెస్1 (ఎస్డిఎన్1) పద్ధతిలో రూపొందించిన జన్యు సవరణ వంగడాలను సాధారణ కొత్త వంగడాల మాదిరిగానే పరిగణించాలనే అంశంపై విధాన రూపకల్పన దిశగా చెప్పుకోదగిన స్థాయిలో చర్చలు కొనసాగుతున్న దేశాలు. పాత చట్టాల ప్రకారం న్యాయస్థానాలు వ్యాఖ్యానాలకు అనుగుణంగా ఎస్డిఎన్1 పద్ధతిలో రూపొందించిన జన్యు సవరణ వంగడాలను జన్యు మార్పిడి జీవులు(జిఎంఓల)గానే పరిగణిస్తున్న దేశాలు. ఉత్తర అమెరికాజన్యుసవరణ వంటి సరికొత్త బ్రీడింగ్ ఆవిష్కరణలను సాధారణ వంగడాలుగా పరిగణిస్తూ పటిష్ట చట్టాలు చేసిన తొలి వరుస దేశాల్లో అమెరికా, కెనడా ముందు భాగాన ఉన్నాయి. జన్యు సవరణ చేసిన అధిక ఓలిక్ సోయాబీన్స్ నుంచి తీసిన నూనెను ‘కాలినో’ పేరిట విక్రయిస్తున్నారు. ఇది అమెరికాలో 2019 నుంచి వాణిజ్యపరంగా సాగవుతున్న తొలి జన్యు సవరణ పంట.లాటిన్ అమెరికాజన్యు సవరణ వంటి న్యూ బ్రీడింగ్ ఇన్నోవేషన్స్‌ను అనుమతిస్తూ 8 లాటిన్ అమెరికా దేశాలు చట్టాలు చేశాయి: బ్రెజిల్, చిలి, కొలంబో, ఈక్వడార్, గ్వాటెమల, హాండురస్, పరాగ్వే, అర్జెంటీనా. అర్జెంటీనా 2015లోనే తొలి చట్టం చేసింది. కోసిన తర్వాత రంగు మారకుండా ఉండేలా జన్యు సవరణ చేసిన బంగాళదుంపను క్రిస్పర్ ద్వారా 2018లో అర్జెంటీనా రూపొందించింది.యూరప్జన్యు సవరణ వంటి న్యూ జినోమిక్ టెక్నిక్స్‌ను జన్యుమార్పిడి వంగడాలుగా కాకుండా సాధారణ కొత్త వంగడాలుగానే భావించాలని యూరోపియన్ యూనియన్ 2023 జూలైలో ప్రతిపాదించింది యునైటెడ్ కింగ్డమ్లో ప్రెసిషన్ బ్రీడింగ్ బిల్లును 2022 మేలో ప్రవేశపెట్టారు. 2023 మార్చిలో రాజు ఆమోదం పొందింది. ఈ చట్టం సైన్స్ బేస్డ్ నియంత్రణ వ్యవస్థను నెలకొల్పటం ద్వారా పరిశోధనలకు దోహదం చేస్తోంది.చదవండి: జీనోమ్ ఎడిటింగ్.. ప్రయోజనాలు, ప్రతికూలతలుఆసియా పసిఫిక్జన్యు సవరణ వంగడాలు/ఉత్పత్తులను అనుమతిస్తూ ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పీన్స్, భారత్ చట్టాలు చేశాయి. జపాన్‌లో జన్యు సవరణ చేసిన ‘హై గబ’ టొమాటోను 2021 నుంచి విక్రయిస్తున్నారు. బ్రౌన్‌గా మారకుండా ఉండేలా జన్యు సవరణ చేసిన అరటి రకాన్ని నాన్–జిఎంఓ ఉత్పత్తిగా పరిగణిస్తూ ఫిలిప్పీన్స్‌లో 2023లో చట్టం చేసింది. భారత ప్రభుత్వం జన్యు సవరణను జనుమార్పిడి నియంత్రణ జాబితా నుంచి 2023లో మినహాయించింది. తొలి రెండు జన్యుసవరణ అధిక దిగుబడి వరి వంగడాలను 2025 మేలో విడుదల చేసింది.ఆఫ్రికాజన్యు సవరణ వంటి న్యూ బ్రీడింగ్ ఇన్నోవేషన్స్‌ను అనుమతిస్తూ 4 ఆఫ్రికా దేశాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి: నైజీరియా (ఫిబ్రవరి 2022), కెన్యా (మార్చి 2022), మలావి (ఆగస్టు 2022), ఘన (అక్టోబర్ 2023). ఇన్ఫోగ్రాఫిక్ సౌజన్యం: isaaa.org -
జన్యు సవరణ అంటే ఏంటి?
మన దేశ వ్యవసాయ రంగంలో ఇటీవల సంచలనం సృష్టిస్తున్న అధునాతన సాంకేతికత ‘జీన్ ఎడిటింగ్ – జి.ఇ.’. జన్యు సవరణ అనేది శాస్త్రవేత్తలు మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియాతో సహా సకల జీవుల లక్షణాలను మెరుగుపరచడానికి అనుమతించే సరికొత్త బ్రీడింగ్ పద్ధతుల్లో ఒకటి. జన్యు సవరణ కోసం ఉపయోగించే సాంకేతికతలు కత్తెర లాగా పనిచేస్తాయి. డి.ఎన్.ఎ. అంటే డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం. ముఖ్యంగా క్రోమోజోముల్లో ఉంటుంది. మైటోకాండ్రియాలలో చాలా కొద్దిగా కనిపిస్తుంది. జీవులన్నింటిలో డి.ఎన్.ఎ. ముఖ్యమైన జన్యు పదార్థంగా వ్యవహరిస్తుంది. జీవుల్లో అనువంశికానికి డి.ఎన్.ఎ. మూలాధారం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో డి.ఎన్.ఎ.ను కత్తిరించడం, కత్తిరించిన లేదా తెలిసిన డి.ఎన్.ఎ. శ్రేణులను తొలగించడం, జోడించడం లేదా భర్తీ చేయడం వంటివి చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల డిఎన్‌ఎలోని జన్యువుక్రమంలో ఆశించిన అవసరం మేరకు అందుకు సంబంధించిన జన్యువును కత్తిరించటం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టుకోవటమే జన్యు సవరణ ప్రక్రియ లక్ష్యం.జీన్ ఎడిటింగ్ సింథటిక్ బయాలజీలో ఒక భాగం. ఇది జీవశాస్త్రం, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ సూత్రాలను కలిపి కొత్త జీవ వ్యవస్థలను సృష్టించడానికి, ఉన్న వాటిని సవరించడానికి ఉపయోగపడుతుంది. సింథటిక్ బయాలజీ (Synthetic biology) అనేది సాపేక్షంగా కొత్త రంగం. ఈ సంకేతికతకు ఉన్న విస్తారమైన సామర్థ్యం కారణంగా ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన రీతిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మొక్కలు, బ్యాక్టీరియా వంటి జీవుల జన్యువుల్లో మార్పులు చేయడం ద్వారా నిర్దిష్ట విధులను నిర్వర్తించగల కొత్త జీవ వ్యవస్థలను సృష్టించవచ్చు. జీనోమ్ ఇంజనీరింగ్‌ను వ్యవసాయం, వైద్యం, బయోటెక్నాలజీ (Biotechnology) సహా వివిధ రంగాల్లో ఉపయోగించవచ్చు. వ్యవసాయాన్ని మరింత సుస్థిరమైన, సమర్థవంతమైన, పర్యావరణ హితమైన రంగంగా మార్చుకోవచ్చు. ఈ సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సింథటిక్ బయాలజీ పద్ధతుల్లో జన్యు సవరణ ఒకటిసింథటిక్ బయాలజీలో ఉపయోగించే పద్ధతులు అనేకం ఉన్నాయి. డిఎన్ఎ సంశ్లేషణ – అసెంబ్లీ, జీనోమ్ ఎడిటింగ్, ప్రోటీన్ ఇంజనీరింగ్, జీవక్రియ ఇంజనీరింగ్, సిస్టమ్స్ బయాలజీ వంటివి అందులో ముఖ్యమైనవి. జన్యు సవరణలో క్రిస్పర్ – కాస్9 వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇది నిర్దిష్ట డిఎన్ఎ శ్రేణులను కత్తిరించడానికి, సవరించడానికి డిఎన్ఎ గైడెడ్ న్యూక్లియస్‌లను ఉపయోగిస్తుంది. తెగుళ్లు, పర్యావరణ ఒత్తిడి, పంట దిగుబడితో సంబంధం ఉన్న జన్యువుల సవరణల ద్వారా వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో జీనోమ్ ఎడిటింగ్ (Genome Editing) విప్లవాత్మక మార్పులను తేగలిగిన స్థితిలో ఉంది. జన్యు సవరణ ప్రయోజనాలు⇒ ఖచ్చితమైన నియంత్రణతో జీవ వ్యవస్థలను రూపొందించే, నిర్మించే సామర్థ్యం కలిగి ఉండటం జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికతల ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.⇒ వ్యవసాయం, వైద్య చికిత్సలు, పర్యావరణ కాలుష్య నివారణ, పారిశ్రామిక అప్లికేషన్లకు ఈ సాంకేతితక కొత్త మార్గాలను తెరుస్తుంది.⇒ ఉదాహరణకు, నిర్దిష్ట వ్యాధులను లక్ష్యంగా చేసుకోగల ప్రత్యేక ఔషధాలను రూపొందించడానికి లేదా పర్యావరణంలోని కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయగల సూక్ష్మజీవులను రూపొందించడానికి సింథటిక్ బయాలజీని ఉపయోగించవచ్చు.⇒ ఆహార భద్రత, ఇంధనం, వాతావరణ మార్పు వంటి విశ్వవ్యాప్త సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా సింథటిక్ బయాలజీని ఉపయోగించవచ్చు.⇒ ఉదాహరణకు, సింథటిక్ బయాలజీ వాతావరణ మార్పులను దీటుగా తట్టుకునే పంటలను అభివృద్ధి చేయవచ్చు. పురుగుమందులు, కలుపు మందుల వాడకాన్ని తగ్గించడానికి, పంటల దిగుబడిని పెంపొందించడానికి సహాయపడుతుంది.జన్యు సవరణ ప్రతికూలతలు⇒ జన్యు సవరణ వంటి సింథటిక్ బయాలజీ సాంకేతికత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానికి వుండే సమస్యలు దానికి ఉన్నాయి. జీవుల జన్యువుల్లో మార్పులు చేయటంలో భద్రత, నైతిక చిక్కులు ఇమిడి ఉన్నాయి.⇒ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించుకోవాలి. అందుకు జాగ్రత్తగా నియంత్రణ, పర్యవేక్షణ అవసరం.చదవండి: జన్యు సవరణ వరి వంగడాలను ఆవిష్కరించిన ఐసీఏఆర్⇒ అధిక ధర, సంక్లిష్టత దీనికి ఉన్న పెద్ద ప్రతికూలత. ప్రత్యేకమైన పరికరాలు, సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ఇందుకు భారీ పెట్టుబడి అవసరం, దీని వలన చిన్న తరహా ప్రాజెక్టులను చేపట్టటం కష్టంగా మారుతుంది.⇒ ఊహించని పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. జన్యు మార్పులకు లోనైన జీవులు సహజ వాతావరణంతో అనూహ్య విధాలుగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. -
తొలి ‘జన్యుసవరణ’ వరి!
వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 30% అధిక దిగుబడిని ఇవ్వగలిగిన రెండు సరికొత్త జన్యుసవరణ వరి రకాలను ప్రపంచంలోనే తొట్టతొలిగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) శాస్త్రవేత్తలు రూపొందించారు. క్రిస్పర్– కాస్9 అనే సరికొత్త జీనోమ్–ఎడిటింగ్(జిఇ) టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన రెండు వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కి చెందిన పూసాలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) పూసా రైస్ డిఎస్టి1 అనే రకం కరువును, చౌడును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల) అనే వరి అధిక దిగుబడినిస్తుంది. మన దేశంలో ఇప్పటి వరకు అధికారికంగా సాగులో ఉన్న జన్యుమార్పిడి పంట పత్తి ఒక్కటి మాత్రమే. జన్యుసవరణకు ఇదే ప్రారంభం. గతంలో సంక్లిష్టమైన ‘జన్యుమార్పిడి’లో భాగంగానే ‘జన్యుసవరణ’ను కూడా చూసేవారు. అయితే, 2022లో జన్యుసవరణను కఠినమైన నియంత్రణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత జన్యు సవరణ పరిశోధనలకు రూ. 500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే జన్యుసవరణ తొలి వరి రకాలను ఇప్పుడు ఆవిష్కరించారు. ఈ రెండు వంగడాల పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. పూసా డిఎస్టి రైస్ 1 పై కృషి చేసిన డాక్టర్ విశ్వనాథన్ సి, డాక్టర్ గోపాల్ కృష్ణన్ ఎస్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ శివానీ నగర్, డాక్టర్ అర్చన వాట్స్, డాక్టర్ సోహం రే, డాక్టర్ అశోక్ కుమార్ సింగ్, డాక్టర్ ప్రాంజల్ యాదవ్‌లను సత్కరించారు. డిఆర్ఆర్ రైస్ 100 (కమల) అభివృద్ధికి కృషి చేసిన ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సత్యేంద్ర కుమార్ మంగథియా, డాక్టర్ ఆర్.ఎం. సుందరం, డా. అబ్దుల్ ఫియాజ్, డా. సి.ఎన్. నీరజ, డా. ఎస్వీ సాయి ప్రసాద్‌లను సత్కరించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది మాట్లాడుతూ, ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినది కావటం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రయత్నాల ద్వారా రైతులకు త్వరగా అందించవచ్చని అన్నారు.10కి పైగా పంటలకు జన్యు సవరణఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ జనరల్ మంగి లాల్ జాట్ ప్రసంగిస్తూ ఈ రెండు వంగడాల ఆవిష్కరణ భారత వ్యవసాయంలో ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. రాబోయే సంవత్సరాల్లో అనేక ఇతర పంటలకు సంబంధించి జన్యు సవరణ పంట రకాలను విడుదల చేస్తామని అన్నారు. ‘కొత్త వ్యవసాయ విధానాలు కొత్త పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. మారిన వాతావరణ పరిస్థితుల్లో పాత పద్ధతులు పనిచేయవు’ అని ఆయన అన్నారు. దేశంలోని బహుళ జాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పప్పుధాన్యాలు, ఆవాలు, గోధుమ, పొగాకు, పత్తి, అరటి, టమోటా, నూనెగింజలు వంటి 10కి పైగా పంటలకు సంబంధించి జన్యు–సవరణపై పరిశోధనలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ చైర్ ఆఫ్ అగ్రికల్చర్ – ఫుడ్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ క్రాప్ అండ్ ఫుడ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ రాజీవ్ వర్షిణి మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణలు వ్యవసాయ జీవసాంకేతికతలో ఒక మైలురాయన్నారు. ప్రత్యేకంగా చిన్న–సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని, ప్రపంచ పురోగతికి ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ రెండు జన్యు సవరణ వంగడాలను వాణిజ్య స్థాయిలో విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించడానికి మరో నాలుగైదు సంవత్సరాలు పట్టొచ్చు. కరువు, చౌడును అధిగమించి..ఎంటియు1010 వరి వంగడానికి జన్యు సవరణ చేసి ‘పూసా రైస్ డిఎస్టి 1’ వంగడాన్ని పూసాలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసింది. ఒత్తిడి నిరోధకతను అణిచివేసే జన్యువును తొలగించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. పత్ర రంధ్రాల సాంద్రతను తగ్గించటం ద్వారా తక్కువ నీటితో పంట పండేలా మార్పు చేశారు. చౌడును తట్టుకొని ఎక్కువ పిలకలు వచ్చేలా చేయటం ద్వారా అధికంగా ధాన్యం దిగుబడి వచ్చేలా చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల్లో ఎంటియు 1010 రకంతో పోలిస్తే కరువు, చౌడు వత్తిళ్లను తట్టుకొని గణనీయంగా అధిక దిగుబడిని చూపించాయని ఐఎఆర్ఐ తెలిపింది.సాంబ మసూరికి కొత్త రూపుదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది, విస్తారంగా సాగవుతున్న సాంబ మసూరి (బిపిటి–5204) వంగడానికి జన్యుసవరణ చేసి ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకాన్ని అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్‌లోని 30% అధిక దిగుబడిని ఇస్తుంది. 20 రోజులు ముందే కోతకు వస్తుంది. ‘క్రిస్పర్’ను ఉపయోగించి సాంబ మసూరిలోని సైటోకినిన్ ఆక్సిడేస్ జన్యువుకు తగిన విధంగా సవరణ చేశారు. ఫలితంగా ధాన్యం దిగుబడిలో 19% పెరుగుదల, 20 రోజుల వరకు ముందస్తు పరిపక్వతతో పాటు తక్కువ ఎరువుల వినియోగం, కరువు పరిస్థితులలో మెరుగైన పనితీరు వంటి గుణాలతో ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకం రూపుదాల్చింది.ఐసిఎఆర్ శాస్త్రవేత్తల అసాధారణ విజయాలువ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఆయన మాటల నుంచి ప్రేరణ పొందిన ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు ఈ కొత్త రకాలను సృష్టించడం ద్వారా వ్యవసాయ రంగంలో అసాధారణ విజయాలు సాధించారు. వరిలో ఈ కొత్త పంటలు ధాన్యం ఉత్పత్తిని పెంచడమే కాకుండా పర్యావరణ పరంగా సానుకూల ఫలితాలను ఇస్తాయి. సాగు నీరు ఆదా అవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. తద్వారా పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని 50 లక్షల హెక్టార్లు తగ్గించాలి. ధాన్యం ఉత్పత్తిని కోటి టన్నులు పెంచాలి. ఈ 50 లక్షల హెక్టార్ల భూముల్లో అదనంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చెయ్యాలి.– శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిజన్యుభద్రతా పరీక్షల గణాంకాలను కూడా ప్రకటించాలిఐసిఎఆర్ మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను విడుదల చేసింది. అధిక దిగుబడినిస్తూ, కరువును తట్టుకోవటం కోసం సరికొత్త క్రిస్పర్–కాస్9 టెక్నాలజీని వినియోగించి ఈ రకాలను అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన జన్యుభద్రతా పరీక్షల గణాంకాలను సైతం బహిరంగంగా ప్రకటిస్తే ఈ సరికొత్త వరి బియ్యం తినటంలో భద్రత గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు. – డాక్టర్ సుమన్ సహాయ్, స్వతంత్ర శాస్త్రవేత్త, జీన్క్యాంపెయిన్ వ్యవస్థాపకులు