Gas Trouble: పొట్టలో గ్యాస్‌!.. సమస్యను అధిగమించండిలా

Health Tips To Solve Gas Trouble Issues - Sakshi

ఇది బయటకు చెప్పుకోలేని సమస్య. చాలా ఇబ్బంది కలిగిస్తుంది కూడా. పొట్టలోకి చేరిన గాలి... వస్తే అటు తేన్పు రూపంలో రావాలి... లేదా మలద్వారం నుంచి బయటకు పోవాలి. ఇలా జరగనప్పుడు కడుపులో గ్యాస్‌ చేరి, పొట్ట ఉబ్బరంగా అనిపించి, బాధితులు తీవ్రమైన సమస్యకు లోనవుతుంటారు. ఒక్కోసారి గ్యాస్‌ పెరగడం అనే అంశం ఛాతీలో నొప్పి కలిగించి, ఒక్కోసారి గుండెపోటు వచ్చిందేమోననే అనుమానంతో హాస్పిటళ్లకూ తిప్పుతుంది. ఈ గ్యాస్‌ సమస్యను అధిగమించడం ఎలాగో చూద్దాం. 

మనం ఏదైనా తినే సమయంలో మనకు తెలియకుండానే గాలినీ మింగుతుంటాం. అలా మన జీర్ణవ్యవస్థలోకి చేరిన ఆ గాలి ఆహారంలాగే... పెరిస్టాలిటిక్‌ చలనంతో ముందుకు వెళ్తూ ఉంటుంది. గొంతు కిందనే ఉండి తేన్పు రూపంలో వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ పొట్టలోనే ఉన్నా లేదా తరచూ కింది నుంచి వెళ్తున్నా ఇబ్బందిగా ఉంటుంది. 

ఎవరెవరిలో ఎక్కువ...? 
ఎప్పుడూ ఏదో ఒకటి నములుతూ / చప్పరిస్తూ ఉండేవారు 
వేగంగా తినే/తాగేవారు
గ్యాస్‌ ఎక్కువగా ఉండే కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ / కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగేవారు
పొగతాగేవారు, మద్యం అలవాటు ఉన్నవారు
వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు ∙
బీన్స్, బ్రాకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి వెజిటబుల్స్‌ ఎక్కువగా తినేవారు
ఐస్‌క్రీములు, పాల ఉత్సాదనలు ఎక్కువగా తీసుకునేవారు... వీళ్లందరిలోనూ పొట్టలో గ్యాస్‌ సమస్య ఎక్కువ. 

సమస్యను అధిగమించడం ఎలా? 
మెల్లగా తినడం: ఆహారం తీసుకునే సమయంలో గాలి నోట్లో పోకుండా చేయడం కోసం పెదవులను మూసి ఉంచి ఆహారాన్ని నమలడం. పొగతాగే అలవాటు మానేయడం . కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్‌ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవడం∙ సోడాలు, కార్బొనేటెడ్‌ డ్రింక్స్, కూల్‌డ్రింక్స్, బీర్‌ వంటి బీవరేజెస్‌కు దూరంగా ఉండటం. గ్యాస్‌ను పెంచే వెజిటబుల్స్‌ / పండ్లను పరిమితంగా తీసుకోవడం. 

మేనేజ్‌మెంట్‌ / చికిత్స : కొవ్వు ఎక్కువగానూ ఉండేవీ, బాగా వేయించినవి వీలైనంతవరకు తీసుకోవడం, తీసుకోవాల్సి వస్తే పరిమితంగానే తినడం ∙పాలు, పాల ఉత్పాదనలతో కడుపు ఉబ్బరమై, పొట్టలో గ్యాస్‌ పెరిగితే ల్యాక్టోజ్‌ రహిత పాలు, పాల ఉత్పాదనలను తీసుకోవడం ∙తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం ∙పొగతాగడం పూర్తిగా మానేయడం; కాఫీ, టీ, బీర్‌ వంటికొన్ని ఆల్కహాల్‌ బీవరేజెస్‌కు దూరంగా ఉండటం ∙రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగడం. ∙బరువు పెరగకుండా చూసుకుంటూ, చురుగ్గా ఉంటూ, రోజూ వ్యాయామం చేయడం. 

మందుల విషయానికి వస్తే... 
బీన్స్‌ లేదా గ్యాస్‌ను పెంచే కూరగాయలతో భోజనం చేసినప్పుడు డాక్టర్ల సలహాతో  అల్ఫా–గెలాక్టోసైడేజ్‌ మందులు తీసుకోవచ్చు. ∙కడుపులో గ్యాస్‌తో నొప్పి వస్తుంటే డాక్టర్‌ సలహా మేరకు సైమెథికోన్‌ వంటి మందులు వాడాలి.  డాక్టర్ల సూచనల ప్రకారం మందులు వాడిన మూడు నెలల తర్వాత కూడా గ్యాస్‌ సమస్య తగ్గకపోతే పూర్తి స్థాయి పరీక్షలతో పాటు ఎండోస్కోపీ వంటివి చేయించాల్సి ఉంటుంది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top