
పరిపరిశోధన
పురుషులు నోటి ద్వారా తీసుకునే ఈ సంతాన నియంత్రణ మాత్రలను ప్రస్తుతం ‘వైసీటీ –529’ అని పిలుస్తున్నారు. ‘పిల్స్’ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్న ఆ మాత్రల విషయమేమిటో చూద్దాం.
వైసీటీ – 529 ప్రత్యేకత ఏమిటంటే...
‘యువర్ ఛాయిస్ థెరప్యూటిక్స్’ సంస్థ ఆధ్వర్యంలోకి రాబోతున్న ఈ సంతాన నియంత్రణ పిల్స్‌ను సంక్షిప్తంగా ‘వైసీటీ – 529’ అని పిలుస్తున్నారు. ఇదొక డైలీ పిల్. అంటే తమకు సంతానం వద్దనుకున్నంత కాలం పురుషుడు నోటి ద్వారా తీసుకోవాల్సిన మాత్ర ఇది.
గతంలోనూ పురుషులకూ సంతాన నియంత్రణ మాత్రల తయారీ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే అవన్నీ పురుష హార్మోన్ అయిన ‘టెస్టోస్టెరాన్’ పై పనిచేసేలా రూపొందించడంతో చాలా ప్రతికూలతలు కనిపించాయి. దాంతో అవన్నీ విఫలమయ్యాయి. ఆ అనుభవాల దృష్ట్యా రూపొందించిన ఈ మాత్రలు టెస్టోస్టెరాన్‌పై పనిచేయకుండా...ఇవి తెలివిగా మరో మార్గంలో పనిచేస్తాయి. అంటే వీర్యకణాలను పుట్టించేందుకు తోడ్పడే ‘రెటినాయిడ్ యాసిడ్ రెసె΄్టార్ ఆల్ఫా’ అనే ప్రొటీన్‌ను మాత్రమే ఇవి అడ్డగిస్తాయి. ఫలితంగా పురుషుడి వృషణాలలో వీర్యకణాల ఉత్పత్తి ఆగిపోతుంది. దీనివల్ల ఆ మాత్ర ప్రభావం ఉన్నంతసేపు తాత్కాలికంగా వీర్యకణాలు తయారుకావు. అంతేతప్ప... ఈ పిల్ వల్ల పురుషుడిలో వాంఛలూ, కోరికలూ, సామర్థ్యాలు అన్నీ యథాతథంగా ఉంటాయి. పురుషులలో స్రవించే హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలూ ఉండవు.
పురుషుల్లో కుటుంబ నియంత్రణ పిల్ రావడాన్ని ఎందుకు విప్లవాత్మకమైన మార్పుగా చూస్తున్నామంటే...
ఇప్పటివరకూ యుటెరస్‌లో అమర్చే ఇంట్రా యుటిరైన్ డివైస్ (ఐయూడీ)లైనా, నోటి ద్వారా తీసుకునే పిల్స్ అయినా, హార్మోన్ ఇంజెక్షన్లయినా లేదా ఇతరత్రా ఏ మార్గాలైనా అవి మహిళల కోసమే తయారయ్యాయి / తయారవుతున్నాయి. మహిళల్లో చాలా సంక్లిష్టమైన ప్రక్రియల్లో జీవక్రియలు నిర్వహించే హార్మోన్లను ఈ కాంట్రసెప్టివ్స్ ప్రభావితం చేస్తుండటం వల్ల అవి మహిళల్లో అనేక రకాల ప్రతికూల ప్రభావాలను చూపుతుంటాయి. వాటి ప్రభావంతో కొందరు మహిళలు బరువు పెరగడం, వాళ్ల మూడ్స్ వేగంగా మారిపోతూ ఉండటం (మూడ్ స్వింగ్స్), జీవక్రియల్లో మార్పులతో ఇతరత్రా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తుంటాయి.
ఇక పురుషులకూ కండోమ్, వ్యాసెక్టమీ అనే కుటుంబ నియంత్రణ మార్గాలు ఉన్నప్పటికీ కండోమ్ పూర్తిగా నూరు పాళ్లూ నమ్మదగినది కాదు. తెలియకుండానే ఏ టైమ్‌లోనైనా అది చిరగడం లాంటి అనర్థాలు జరిగినప్పుడు పార్ట్‌నర్‌కు అవాంఛిత గర్భం వచ్చే ప్రమాదం ఉంది. దాంతో తన ప్రమేయమూ, తప్పూ లేకుండానే మహిళా పార్ట్‌నర్‌పై గర్భధారణ భారం పడుతుంది.
ఇక వ్యాసెక్టమీ అనేది కుటుంబ నియంత్రణకు పూర్తిగా శాశ్వత ప్రత్యామ్నాయం. పైగా పురుషులందరిలోనూ అది నూరు పాళ్లూ సక్సెస్ కాకపోవచ్చు. అందుకే పురుషుల్లో వారి లైంగిక ప్రేరణలకు కారణమయ్యే టెస్టోస్టెరాన్‌కు ఏ భంగమూ రాకుండా పిల్ తయారైతే... అది నూరుపాళ్లూ సేఫ్‌గా ఉండటంతో పాటు మహిళపైన ఉద్వేగపరమైనవీ, యాంగై్జటీ వంటి మానసికమైనవి అయిన ఎన్నోరకాల భారాలను సంపూర్ణంగా తొలగిస్తుంది. అందుకే పురుషుల కోసం కూడా పూర్తిగా సురక్షితమైనదీ, నమ్మదగినదీ అయిన పిల్ కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు అదిప్పుడు దాదాపుగా సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు.
తర్వాతి పరిశోధనలేమిటి...?
ఇప్పుడీ 16 మందిపై జరిగిన పరిశోధనలు పూర్తిగా విజయవంతం కావడంతో... ఇకపై మరో 50 మందిపై పరిశోధనలు నిర్వహించనున్నారు. ‘లార్జ్ ఫేజ్ 1బి / 2ఏ’ అనే ఈ అధ్యయనాలను ఈసారి వ్యాసెక్టమీ చేయని పురుషులపై నిర్వహిస్తారు. ఈసారి కొంత ముందుకెళ్లి ఈ రోజువారీ పిల్‌ను వాడినప్పుడు అది ఏ మేరకు స్పెర్మ్‌కౌంట్‌ను పూర్తిగా అదుపు చేసి గర్భం రాకుండా చూస్తుందనే అంశాన్ని పరిశీలిస్తారు. నిజానికి ఈ పిల్ తర్వాత రెండు రోజుల పాటు రక్షణ దొరికే అవకాశాలున్నప్పటికీ గర్భం రావడాన్ని నూరు పాళ్లు నివారించేందుకు ప్రతిరోజూ వాడాల్సి ఉంటుంది.
తర్వాత్తర్వాత దీని ప్రభావాన్ని మరింత పెంచుతూ... రానురానూ మరిన్ని పరిశీలనల తర్వాత దీన్ని రెండు రోజులకోసారి తీసుకోవాలా, మూడు రోజులకోమారు వాడాలా అనేది నిర్ణయిస్తూ, పిల్‌ను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలనేది పరిశోధకుల ఉద్దేశం.
చివరగా... ఇది కేవలం ఒక సరికొత్త పిల్ మాత్రమే కాబోదు. మహిళలూ, పురుషుల మధ్య సమానత్వానికి సంకేతం. మహిళల ఆరోగ్యాలను కాపాడుతూ, వాళ్లలోని హార్మోనల్ అసమతౌల్యాలను నివారిస్తూ... భవిష్యత్తులో మరెంతో మంది మైండ్‌సెట్‌నూ, దృష్టికోణాలనూ సమూలంగా మార్చబోయే ఓ అద్భుతమైన ఔషధం కాబోతోంది ఈ పిల్.
పరిశోధన పూర్వరంగమేమిటీ, ఏ మేరకు పిల్ ప్రభావవంతం?
మానవులపై ప్రయోగించడానికి ముందర ‘వైసీటీ–529’ పిల్‌ను కోతులపైనా, ఎలుకలపైనా ప్రయోగించి చూశారు. పిల్ వాటిల్లో 99 శాతం ప్రభావవంతంగా పనిచేస్తూ వీర్యకణాలు పూర్తిగా లేకుండా చేసింది. తమ పురుష పార్ట్‌నర్‌తో కలిసిన ఆడ కోతులూ, ఆడ ఎలుకలకు గర్భం రాలేదు. పిల్స్ మానేశాక మళ్లీ కొద్ది వారాల్లోనే సంతానోత్పత్తి యధావిధిగా జరగడం మొదలైంది. ఏ లోపమూ రాలేదు.
కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నఆశారేఖ ఇది...
పరిశోధనల్లో ఈ తదుపరి దశలూ విజయవంతమైతే... రానున్న కొన్నేళ్లలోనే... వీలైతే కొన్నాళ్లలోనే పురుషులకూ నమ్మదగిన, సురక్షితమైన, ఒక సింపుల్ పిల్ సంతాన నియంత్రణ కోసం చాలా త్వరలోనే అందుబాటులోకి రానుంది. దాంతో ఇక కాంట్రసెప్టివ్ భారమనేది పూర్తిగా మహిళపైనే పడకుండా... ఇకపై మహిళలతో పాటు పురుషలూ ఆ భారాన్ని సమంగా పంచుకోనున్నారు.
ఎంత వరకు సురక్షితం?
పైన పేర్కొన్న అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇదెంతో సురక్షితమైన పిల్. ఇప్పటివరకూ నిర్వహించిన వైద్యపరీక్షలూ, చేసిన ట్రయల్ రన్స్... వీటన్నింటిలోనూ ఇదెంతో సేఫ్ అని తేలింది. డిసెంబరు 2003 నాటి నుంచి జూన్ 2025 దాదాపు ఈ ఏడాదిన్నర కాలంలో ఆరోగ్యవంతులైన వ్యాసెక్టమీ చేయించుకున్న 16 మంది యువకులపై దీన్ని ప్రయోగించి చూశారు. (తమ పార్ట్‌నర్‌కు అవాంఛిత గర్భం రాకుడదనే ఉద్దేశంతో వ్యాసెక్టమీ అయిన పురుషులను తొలి అధ్యయనాల కోసం ఎంపిక చేసుకున్నారు). వాళ్లకు పిల్‌ను 180 ఎంజీ మోతాదులో ఇస్తూ వాళ్లలో వీర్యకణాలను నిశితంగా పరిశీలిస్తూ వచ్చారు. తేలిన అంశమూ... వినవచ్చిన శుభవార్త ఏమిటంటే... వాళ్లలోని వాంఛలకూ, డ్రైవ్‌కూ, ఉత్సాహానికీ, మూడ్స్‌కూ ఎలాంటి లోపమూ రాలేదు. అంతా నార్మల్. అన్నీ బాగా ఉండటంతో పాటు అనుకున్న ఫలితమూ వచ్చింది. వాళ్లందరిలో వీర్యకణాల సంఖ్య సున్నా అయ్యింది.
– యాసీన్