
త్రినేత్రం
రెండు కళ్ళు చూడలేని దృశ్యాలను కెమెరా కన్ను చూస్తుంది. మారుమూలప్రాంతాలు తిరిగే దీప్తి ఆస్థానా మహిళలు ఎదుర్కొంటున్న నుంచి పర్యావరణ సమస్యల వరకు తన కెమెరా కంటితో ప్రపంచానికి చూపుతుంది. డాక్యుమెంటరీ–స్టైల్ స్టోరీ టెల్లింగ్ ద్వారా ఎందరో సామాన్యుల జీవితాలను ఆవిష్కరిస్తోంది...
‘చెప్పడానికి మన దగ్గర ఎన్నో కథలు ఉంటాయి. నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి ఫోటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్ అనేది ఒక మాధ్యమం’ అంటుంది దీప్తి ఆస్థానా. అనుకోకుండా ఫోటోగ్రఫీలోకి వచ్చింది దీప్తి.
లండన్‌లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నప్పుడు కొలీగ్ ఒకరు తనకు కెమెరా పరిచయం చేశాడు. మొదట్లో కెమెరాకు సంబంధించిన సాంకేతిక విషయాలను తెలుసుకోవడానికే ఆసక్తి చూపేది. ఆ తరువాత ఆమెకు అర్థమయ్యింది ఏమిటంటే...
‘కెమెరా అంటే సాంకేతికతకు సంబంధించిన విషయమే కాదు. అంతకంటే ఎక్కువ. జీవితాలను ఆవిష్కరించే సాధనం’ అనుకుంది. ఇండియాకు తిరిగి వచ్చే సమయానికి దీప్తికి కెమెరా మంచి నేస్తం అయింది. కెమెరా తో రకరకాలప్రాంతాలకు వెళుతుండేది. కెమెరా కంటితో స్వదేశం తనకు కొత్తగా కనిపించింది. గతంలో ఎన్నడూ చూడని అపురూప దృశ్యాలు కనిపించాయి.
‘అందాలు, అద్భుతాలు మాత్రమే కాదు అసమానతలు, అన్యాయాలు చూశాను’ అని తన ప్రయాణ అనుభవాల గురించి చెబుతుంది దీప్తి, ఆ అసమానతలు, అన్యాయాలకు సంబంధించిన కథనాలను వెలికి తీయడానికి కెమెరాను సాధనం చేసుకుంది.
‘ఏ థౌజెండ్ థ్రోన్స్’ప్రాజెక్ట్ ద్వారా రాజస్థాన్‌లోని థార్ ఎడారిప్రాంత మహిళల జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చింది. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ సహకారంతో ‘వెయిట్ ఆఫ్ ది వాటర్’ పుస్తకాన్ని ప్రచురించింది.
ఈ ఫోటోగ్రఫీ స్టోరీ పుస్తకం ద్వారా హిమాలయప్రాంతంలో నీటి సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాల కన్నీటి కథలను ప్రపంచానికి చెప్పింది. ఆప్రాంతంలో మహిళలుప్రాథమిక నీటి అవసరాల కోసం రోజుకు ఆరు నుండి తొమ్మిది గంటలు వెచ్చిస్తున్నారు. నీటి వనరులను కనుగొనడానికి రోజు అయిదు కిలోమీటర్‌ల వరకు నడుస్తున్నారు. నీటి సంక్షోభ ప్రభావం మహిళలు, బాలికలపైనే ఎక్కువ పడుతుంది. బాలికలు విద్యకు దూరం అవుతున్నారు.
‘ఒక అమ్మాయికి అండగా నిలబడి దారి చూపగలిగితే అది వారి జీవితాలను మార్చేస్తుంది. ఇంటికే పరిమితం కాకుండా విద్యా,ఉద్యోగాల్లో వారు రాణిస్తారు’ అంటుంది దీప్తి. సమస్యలను ప్రపంచానికి చూపే, సమస్యల పరిష్కారానికి వేదికలా ఫొటోగ్రఫీని ఉపయోగించుకుంటుంది దీప్తి. ఒక స్వచ్ఛంద సంస్థ సహాయం తీసుకొని కొన్నిప్రాంతాలలో వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం చేసింది.
ఆ మహిళల అరుదైన కృషి
ఫోటోగ్రఫీ అంటే వినూత్నమైన శక్తి. ఫోటోగ్రఫీ అనేది కథ చెప్పడానికే కాదు భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. అదే సమయంలో సమస్య పరిష్కారానికి మార్గం ఆలోచించే దృష్టిని ఇస్తుంది. ఫొటోగ్రఫీ... హృదయ ద్వారాలను తెరిచే తాళం చెవి. గతంలో ఎన్నడూ చూడని జీవితాలతో మమేకం కావడానికి ఉపయోగపడుతుంది. గ్రామీణ భారతంలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నదులు, అడవులను సంరక్షించడానికి కృషి చేస్తున్న అరుదైన మహిళలతో మాట్లాడాను. ఎంతో స్ఫూర్తినిచ్చే మహిళలు వారు. ప్రకృతిని గౌరవించడానికి సంబంధించి మూలాలు మనప్రాచీన చరిత్రలో ఉన్నాయి. ప్రకృతిని గౌరవించాలి, రక్షించుకోవాలి అనే విలువలు మన మూలాలలోనే ఉన్నాయి.
– దీప్తి ఆస్థానా