రూ.2,495 కోట్ల వర్జీనియా అమ్మకాలు
పొగాకు అమ్మకాలు
● ముగిసిన పొగాకు వేలం ప్రక్రియ
● కిలోకు అత్యధిక ధర రూ.456
జంగారెడ్డిగూడెం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియ ముగిసింది. దేవరపల్లి , జంగారెడ్డిగూడెం–1, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–2, గోపాలపురం కేంద్రాల్లో దశల వారీగా వేలం నవంబర్ 29తో ముగిసింది. మొత్తంగా రూ.2,495.52 కోట్ల విలువైన 83.88 మిలియన్ కిలోల పొగాకును రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కిలోకు రూ.456 ధర లభించింంది. వేలం ప్రారంభంలో కిలో ధర రూ.290 పలకగా రైతులు నిరాశ చెందారు. అయితే వేలం ప్రక్రియ కొనసాగుతుండగా విదేశీ ఎగుమతుల ఆర్డర్లు రావడంతో క్రమేపీ ధర పెరిగింది. వాస్తవానికి ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలో 62.11 మి.కిలోల పంట పండించేందుకు పొగాకు బోర్డు అనుమతివ్వగా, రైతులు 83.88 మి.కిలోల పంట పండించారు. పరిమితికి మించి పంట పండించినా రైతులకు గణనీయమైన ధర లభించింది. కాగా కిలోకు అత్యధికంగా సగటు ధర రూ.297.50 దక్కింది. కేంద్రాల వారీగా దేవరపల్లిలో రూ.386.12 కోట్లు, జంగారెడ్డిగూడెం–1లో రూ.554.75 కోట్లు, కొయ్యలగూడెంలో రూ.530.32 కోట్లు, జంగారెడ్డిగూడెం–2లో రూ.576.67 కోట్లు, గోపాలపురంలో 446.93 కోట్ల అమ్మకాలు జరిగాయి. వేలం మార్చి నెలలో ప్రారంభం కాగా, సుమారు 8 నెలల పాటు ప్రక్రియ సాగింది. సగటున 190 రోజులు వేలం కొనసాగగా, మొదట దేవరపల్లి వేలం కేంద్రంలో 175 రోజులకు ముగిసింది. చివరగా జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 200 రోజులకు ముగిసింది. ఈ ఏడాది వేలం ఆలస్యం కావడానికి అత్యధిక పంట పండటమే కారణమని అంటున్నారు.
వేలం కేంద్రం అనుమతించిన అమ్మిన సగటు గరిష్ట కనిష్ట వేలం
పంట పంట ధర ధర ధర జరిగిన
(మి.కి) (మి.కి) (కిలో) (కిలో) (కిలో) రోజులు
దేవరపల్లి 11.51 13.18 292.96 455 50 175
జంగారెడ్డిగూడెం–1 12.64 18.57 299.06 456 50 198
కొయ్యలగూడెం 12.62 17.88 296.60 456 48 193
జంగారెడ్డిగూడెం–2 13.37 19.18 300.66 456 50 200
గోపాలపురం 11.97 15.07 296.57 455 49 186


