రాజీ మార్గమే ఉత్తమం | - | Sakshi
Sakshi News home page

రాజీ మార్గమే ఉత్తమం

Jul 6 2025 7:03 AM | Updated on Jul 6 2025 7:03 AM

రాజీ

రాజీ మార్గమే ఉత్తమం

ఏలూరు (టూటౌన్‌)/ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): రాజీ మార్గమే ఉత్తమమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి అన్నారు. శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. లోక్‌ అదాలత్‌ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీదేవి మాట్లాడుతూ కక్షిదారులకు త్వరితగతిన కేసుల పరిష్కారం నిమిత్తం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. కక్షిదారులు సౌలభ్యం కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలు ఏర్పాటు చేసి త్వరితగతిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని తెలిపారు. రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, ఐదో అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్‌ మురళీకృష్ణ, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాస మూర్తి, పోక్సో జడ్జి కుమారి శ్రీవాణి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌ పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లో 6324 పెండింగ్‌ కేసులను, 141 ప్రీ లిటిగేషన్‌ కేసులను రాజీచేసినట్టు జిల్లా జడ్జి ఎస్‌.శ్రీదేవి తెలిపారు. రాజీ కేసుల్లో మోటార్‌ వాహన ప్రమాద కేసులు 129, సివిల్‌ కేసులు 219, క్రిమినల్‌ కేసులు 5,976 ఉన్నాయన్నారు.

వైఎస్సార్‌టీయూసీ కార్యదర్శిగా పల్లె రవీంద్రరెడ్డి

నూజివీడు: రాష్ట్ర వైఎస్సార్‌టీయూసీ సెక్రటరీగా నూజివీడుకు చెందిన పల్లె రవీంద్రరెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రవీంద్రరెడ్డిని నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రవీంద్ర రెడ్డి మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా, రైతు సలహా సంఘం జిల్లా సభ్యుడిగా, వైఎస్సార్‌టీయూసీ జిల్లా సెక్రటరీగా పనిచేశారు.

నిండుకుండలా గోదావరి

కుక్కునూరు: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు చేరింది. శనివారం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 20 అడుగులకు చేరుకుంది. కుక్కునూరు వద్ద నిండుకుండను తలపిస్తోంది. వరద ప్రవాహం పెరగడంతో శనివారం ఉదయం వరకు గోదావరి ఇసుక తెన్నెల మీద ఉన్న జాలర్లు సామన్లు, వలలతో సహా ఒడ్డుకు చేరుకున్నారు. గోదావరి వరద ప్రవాహంగా స్వల్పంగా పెరిగిందని కుక్కునూరు తహసీల్దార్‌ కె.రమేష్‌బాబు అన్నారు .రానున్న రోజుల్లో ప్రవాహం మరింత పెరిగినా బాధిత గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు పునరావాస సహాయక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు.

1.87 లక్షల క్యూసెక్కులు విడుదల

పోలవరం రూరల్‌: గోదావరి వరద పెరుగుతూ ఉభయగోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 27.920 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి దిగువకు 1.87 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు చేరుతోంది.

పాఠశాల లాగిన్‌కు ఎస్‌ఎస్‌సీ జవాబు పత్రాలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇటీవల నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ ఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబుపత్రాలు సంబంధిత పాఠశాలల లాగిన్‌కు విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలు వెంటనే సదరు విద్యార్థులకు ప్రింట్‌ తీసి అందచేయాలని ఆదేశించారు.

రాజీ మార్గమే ఉత్తమం 
1
1/1

రాజీ మార్గమే ఉత్తమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement