జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..! | - | Sakshi
Sakshi News home page

జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..!

Jul 6 2025 6:43 AM | Updated on Jul 6 2025 6:43 AM

జంతువ

జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..!

కై కలూరు/కొయ్యలగూడెం : మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్‌ వ్యాధులు అంటారు. పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి 1885లో ఫ్రెంచ్‌ జీవశాస్త్రవేత్త లూయిస్‌ పాశ్చర్‌ రేబీస్‌ టీకాను ప్రయోగించి, విజయం సాధించిన సందర్భంగా ప్రతి ఏటా జూలై 6న జూనోసిస్‌ దినోత్సవం జరుపుతారు. జూనోసిస్‌ డే సందర్భంగా జిల్లాలో పశువైద్యశాలల్లో ఆదివారం కుక్కలకు ఉచిత రేబీస్‌ టీకాలు వేస్తారు.

జూనోటిక్‌ వ్యాధులపై అప్రమత్తత

జంతువుల నుంచి సోకే వ్యాధులపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యులు సూచిస్తున్నారు. జంతువుల లాలాజలం, రక్తం, మూత్రం, శ్లేష్మం, మలం, ఇతర శరీర ద్రవాల కారణంగా మనుషులకు జూనోటిక్‌ వ్యాధులు సోకుతాయి. వీటిలో పాడి పశువుల నుంచి ఆంత్రాక్స్‌, బ్రూసిల్లోసెస్‌, లప్టిరియోసిస్‌, రింగ్‌ వార్మ్‌ వ్యాధులు, గొర్రెలు, మేకలు నుంచి హైడాటిడోసిస్‌, సార్కోసిప్టిస్‌, ఆంత్రాక్స్‌, బ్రూసిల్లోసెస్‌, లప్టిరియోసిస్‌, సాల్మోనెల్లోసిస్‌, క్యూ–పివర్‌, మేంజ్‌ వ్యాధులు, కుక్కల నుంచి రేబీస్‌, లీష్మీనియా, బద్దెపురుగుల వ్యాధి, రింగ్‌ వార్మ్‌, హైడాటిడోసెస్‌, మీసిల్స్‌, మంప్స్‌, మేంజ్‌ వ్యాధులు సోకుతున్నాయి. జూనోటిక్‌ వ్యాధులు ఎక్కువగా కేన్సర్‌ వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భిణీ రోగులు, 5వ సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలు, అడవిలో జంతువులతో సహజీవనం చేసే వ్యక్తులకు సోకే అవకాశం ఉంది.

జిల్లాలో 25 వేల ఉచిత రేబీస్‌ టీకాలు

ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు కలిపి మొత్తం 25 వేల ఉచిత రేబీస్‌ టీకాలు వచ్చాయి. జిల్లాలో ప్రాంతీయ పశువైద్యశాలలు 11, వెటర్నరీ డిస్పెన్సరీలు 66, గ్రామీణ పశు వైద్యశాలలు 57, రైతు సేవాకేంద్రాలు 315 ఉన్నాయి. వీటి పరిధిలో ఆవులు, గేదెలు కలిపి 6,01,589, మేకలు, గొర్రెలు కలిపి 8,06,374, కుక్కలు 15,222 (వీధి కుక్కలు మినహాయించి)గా గుర్తించబడ్డాయి. ఆదివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల్లో పశువైద్యులు ఉచితంగా రేబీస్‌ టీకాలు అందిస్తారు. అదే విధంగా జూనోటిక్‌ వ్యాధులపై పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కలిగిస్తారు.

46 వేల బ్రూసెల్లా ఉచిత టీకాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్‌ యానిమల్‌ డీసీస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం(ఎన్‌ఏడీసీపీ)లో భాగంగా బ్రుసెల్లా వ్యాధిని 2030 నాటికి నిర్మూలించాలనే ధ్యేయంతో మూడేళ్లగా ఉచిత వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. ఏలూరు జిల్లాలో మూడు విడతల్లో 46 వేల బ్రుసెల్లా వ్యాధి నిరోధక టీకాలు 4–8 నెలల మధ్య వయస్సు కలిగిన ఆడ దూడలకు మాత్రమే ఉచితంగా అందించారు. అది జీవితకాలం వ్యాధి సోకకుండా రక్షణ ఇస్తుంది.

నేడు ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం

ఏలూరు జిల్లాకు 25 వేల ఉచిత రేబీస్‌ వ్యాక్సిన్లు

బ్రూసెల్లోసిస్‌ అంటువ్యాధిపై ప్రజలకు అవగాహన

జిల్లాలో 134 పశు వైద్యశాలల్లో కుక్కలకు ఉచిత టీకాలు

మనుషులకు సోకుతున్న బ్రూసెల్లోసిస్‌ వ్యాధి

బ్రూసెల్లోసిస్‌ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు సోకే ఒక ముఖ్యమైన జూనోటిక్‌ వ్యాధి. వ్యాధి సోకిన జంతువులు, కలుషితమైన జంతు ఉత్పత్తులు, ప్రయోగశాలలో బ్రూసెల్లోసిస్‌ సోకిన జంతువుల ద్రావములను తాకడంతో మానవులకు ఇది వ్యాపిస్తోంది. పశువైద్యులు, పాడి రైతులు, కబేళాల కార్మికులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా పాశ్చరైజ్‌ చేయని పాల ఉత్పత్తులు, వ్యాధి సోకిన జంతువుల నుంచి ఉడికించని మాంసం తీసుకోవడం వల్ల కూడా ఇది సోకుతోంది. జ్వరం, కీళ్ల నొప్పులు, అలసట, నీరసం. మగవారిలో వృషణాల వాపు, కుచించుకుపోవడం, వంధ్యత్వానికి గురవుతున్నారు.

రేబీస్‌ వ్యాధి సులభంగా వ్యాపిస్తుంది

ఇది కేవలం కుక్క కాటుతోనే కాక, వ్యాధిసోకిన జంతువు లాలాజలం గాయాల మీద పడితే కూడా వ్యాపిస్తుంది. రేబీస్‌ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. కాబట్టి, కుక్కలు, పిల్లుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయించడం చాలా ముఖ్యమైనది. కాటు సంభవించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి రేబీస్‌ వ్యాధి వ్యాప్తిని నిరోధించడం చాలా అవసరం.

– బీఆర్‌ శ్రీనివాస్‌, పశు వైద్యాధికారి, కొయ్యలగూడెం

టీకాలు తప్పనిసరి

పెంపుడు జంతువులతో మానవులకు అవినాభవ సంబంధం ఉంది. ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. జూనోటిక్‌ వ్యాధులపై అందరూ అవగాహన పెంచుకోవాలి. పశుసంవర్థకశాఖ ద్వారా ఏటా జూనోసెస్‌ డే సందర్భంగా ఉచిత రేబీస్‌ టీకాలు వేస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ పఠాన్‌ ముస్తాఫా ఖాన్‌, పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు, కై కలూరు

జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..! 1
1/2

జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..!

జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..! 2
2/2

జంతువుల వ్యాధులతో జర జాగ్రత్త..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement