China-India: భారత్‌ – చైనా చర్చలు

Sakshi Editorial on India, China Hold Talks on LAC Issue

China-India: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద 22 నెలల క్రితం తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత–చైనాల మధ్య శుక్రవారం మరోసారి చర్చలు జరిగాయి. వరసక్రమంలో ఇవి 15వ దఫా చర్చలు. రెండు నెలల క్రితం జరిగిన చర్చల వల్ల ఎలాంటి ఫలితమూ కనబడకపోవడం కారణంగా ఈ చర్చల ప్రక్రియపై కొంత నిరాశా నిస్పృహలు ఏర్పడిన మాట వాస్తవమే. అయితే చర్చలకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు కనుక ఇవి కొనసాగక తప్పదు. 2020 మే నెల మొదటి వారంలో ప్యాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య తొలిసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాలూ భారీయెత్తున సైన్యాన్నీ, ఆయుధ సామగ్రినీ తరలించాయి. ఆ ఏడాది జూన్‌ నెలలో చైనా సైనికులు రాళ్లు, ఇనుపరాడ్లతో దాడికి దిగినప్పుడు మన జవాన్లు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మన సైనికుల ఎదురుదాడిలో చైనా సైన్యం కూడా తీవ్రంగా నష్టపోయిందన్న కథనాలు వెలువడ్డాయి. సైన్యం స్థాయిలోనూ, దౌత్యపరంగానూ చర్చోపచర్చలు జరిగాక నిరుడు ప్యాంగాంగ్‌ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రెండు దేశాలూ సైన్యాలను ఉపసంహ రించుకున్నాయి. గోగ్రాలో కూడా ఇది పూర్తయింది.

హాట్‌ స్ప్రింగ్స్‌ (పెట్రోలింగ్‌ పాయింట్‌–15) ప్రాంతాలనుంచి ఉపసంహరణ విషయంలో చైనా నానుస్తోంది. అలాగే డెస్పాంగ్‌ బల్జ్, డెమ్‌చోక్‌ లతో సహా మరికొన్న చోట్ల కూడా ఉపసంహరణ మొదలుకావాల్సి ఉంది. దశాబ్దాల తరబడి ఎల్‌ఏసీపై ఏకాభిప్రాయం కుదరక ఇరు దేశాల మధ్యా అడపాదడపా ఉద్రిక్తతలు అలుముకుంటున్నాయి. మాస్కోలో 2020లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశాల సందర్భంగా మన విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యి సమావేశమయ్యాక ఇరు దేశాల మధ్యా పరస్పరం చర్చలు జరగాలని నిర్ణయించారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలనీ, ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను గౌరవించాలనీ అవగాహన కుదిరింది. కానీ ఆ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది చైనాయే. సరిహద్దుల్లో దీర్ఘకాలం సైన్యాలను మోహ రించడం వల్ల అనుకోని సమస్యలు వచ్చిపడతాయి. ఉద్రిక్తతలు పెరుగుతాయి. అవి ఘర్షణలకు దారితీస్తాయి. వర్తమాన రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధమే అందుకు తార్కాణం.

ఇరుగు పొరుగు దేశాలు రెండూ భాగస్వాములుగా మెలగాలితప్ప ప్రత్యర్థులుగా కాదని చైనా విదేశాంగమంత్రి గతంలో అన్నారు. కానీ ఆచరణలో అందుకు సంబంధించిన జాడలు కనబడవు. అమెరికా రూపొందించి అమలు చేస్తున్న ఇండో–పసిఫిక్‌ వ్యూహం సారాంశం ఆసియాలో మరో నాటో రూపకల్పన తప్ప మరేమీ కాదని ఆయన ఈమధ్య చేసిన వ్యాఖ్య కీలకమైనది. ఇండో–పసిఫిక్‌ వ్యూహంలో భాగంగా అమెరికా చొరవతో ఏర్పాటైన చతుర్భుజ కూటమి (క్వాడ్‌)లో భారత్‌ భాగస్వామి. దీంతోపాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా మధ్య నిరుడు సెప్టెంబర్‌లో ‘ఆకస్‌’(ఆస్ట్రేలియా, యూకే, అమెరికా) ఒప్పందం కుదిరింది. ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గా ములు సమకూర్చడంతోపాటు ఇతరత్రా అంశాల్లో సైతం హామీ ఇవ్వడం ఈ ఒప్పందం సారాంశం. ఇది కూడా ఇండో–పసిఫిక్‌ వ్యూçహానికి సంబంధించిందే. ఇదికాక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్, అమెరికా భాగస్వాములుగా ‘ఫైవ్‌ ఐస్‌’ పేరుతో రక్షణ సంబంధమైన నిఘా, అంతరిక్ష నిఘా వగైరాలకు సంబంధించి మరో ఒప్పందం ఉంది. ఇవన్నీ తనను చుట్టుముట్టి కట్టడి చేయడానికేనని చైనా బలంగా విశ్వసిస్తోంది. అయితే చైనా ఆరోపిస్తున్నట్టు ఇప్పటికైతే క్వాడ్‌ సైనిక కూటమి కాదు.

ఇండో–పసిఫిక్‌ ప్రాంత దేశాలు కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, వాతావరణ మార్పులు, కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి వంటి అంశాలకు మాత్రమే అది పరిమిత మైంది. ఇది ముందూ మునుపూ ఏమవుతుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సైనిక కూటములు ఏర్పడటం, కయ్యానికి కాలుదువ్వడం వంటి పరిణామాలు ఎవరికీ మంచిది కాదు. అందుకు ప్రస్తుత ఉక్రెయిన్‌ ప్రత్యక్ష ఉదాహరణ. సామరస్య పూర్వకంగా సంప్రదింపులు జరుపుకోవడం, ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అన్వేషించడం ఉత్తమమైన మార్గం. కానీ సమస్యలో భాగమైన అన్ని పక్షాలూ అందుకు నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అవతలి పక్షానికి విశ్వాసం కల్పించాలి. కానీ ఎల్‌ఏసీ విషయంలో మాత్రమే కాదు... బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ (బీఆర్‌ఐ) పేరిట రూపకల్పన చేసిన బృహత్తర ప్రాజెక్టులో సైతం చైనా మన వ్యూహా త్మక ప్రయోజనాలను దెబ్బతీసే ఎత్తుగడలు అనుసరించింది.  

ఇండో–పసిఫిక్‌ వ్యూహం తన కట్టడి కోసమే ఉనికిలోకొచ్చిందన్న సందేహం చైనాకు ఉండటం వల్లే ఎల్‌ఏసీ వద్ద యధాతథ స్థితిని దెబ్బతీసి, మన దేశాన్ని చికాకుపరచడం మొదలుపెట్టింది. ఇది తెలివితక్కువ పని. నిజానికి వివాదంలో మూడో పక్షం ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నట్టు అనుమానం కలిగితే సత్వరం ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడం విజ్ఞుల లక్షణం. చైనాకు అది కొర వడింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇరుగుపొరుగుతో సఖ్యంగా ఉండాలని చైనా నిజంగా కోరుకుంటే అందుకు సంబంధించిన సంకేతాలు కనబడాలి. చర్చల్లో విశాల దృక్పథంతో వ్యవహ రించడం, అక్కడ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తదుపరి చర్యలుండటం అవసరం. భారత్‌ –చైనా మధ్య జరుగుతున్న చర్చలు సాధ్యమైనంత త్వరలో ముగిసి ఒక సానుకూల ఫలితం వస్తుం దనీ, అది రెండు దేశాల మధ్య మెరుగైన సంబంధాలకు మార్గం సుగమం చేస్తుందనీ ఆశించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top