
ఆస్తి వివాదాలే కారణం
శంషాబాద్: ఆస్తి కోసం ఓ వ్యక్తి కన్న తల్లిని దారుణంగా హత్యచేసిన సంఘటన శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్‌జీఐఏ ఇన్‌స్పెక్టర్ బాలరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రాళ్లగూడ రాఘవేంద్ర కాలనీకి చెందిన చంద్రకళ(60)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రకాష్ (35) ఆవారాగా తిరిగేవాడు. గతంలో అతను రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు భార్యలు అతడిని విడిచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం మూడో భార్యతో కలిసి ఉంటున్న అతడికి ఇద్దరు కుమార్తెలు. రాఘవేంద్రకాలనీలోని వంద గజాల ఇంటిలో తన వాటా తనకు ఇవ్వాలని ప్రకాష్ గత కొన్నాళ్లుగా తల్లిపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి పత్రాలు తనకు ఇవ్వాలని వేధిస్తున్నా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో తల్లి నిరాకరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పలుమార్లు తల్లితో గొడవ పడటంతో ఆర్‌జీఐఏ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
మద్యం మత్తులో ఘాతుకం...
బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ప్రకాష్ ఆస్తి పత్రాల కోసం మరోమారు తల్లితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి లోనైన అతను పక్కనే ఉన్న కర్రతో పాటు గ్యాస్ సిలిండర్‌తో తల్లిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment