
మామిడిని కొనుగోలు చేస్తాం
– రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి
గుడిపాల: రైతుల వద్ద నుంచి మామిడిని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు. శనివారం ఫుడ్ అండ్ ఇన్స్ మామిడి గుజ్జు పరిశ్రమని కలెక్టర్ సుమిత్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా మామిడిని కొనుగోలు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. అన్‌లోడింగ్‌కు నాలుగు రోజులు పడుతున్నట్లు రైతులు తెలపగా.. అటువంటి సమస్య రాకుండా చూస్తామని తెలిపారు. అనంతరం ప్రాసెసింగ్ యూనిట్‌లో మామిడి తయారీ ఎలా జరుగుతుందోనని ఆయన యాజమాన్యంతో కలిసి పరిశీలించారు.
తమిళనాడుకు తరలిన ట్రాక్టర్లు
రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి రాకతో మామిడి కాయల ట్రాక్టర్లు అన్నింటినీ తమిళనాడుకు తరలించారు. ఫుడ్ అండ్ ఇన్స్ ఫ్యాక్టరీ తమిళనాడు ప్రాంతానికి ఆనుకుని ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చౌదరి వస్తున్నారన్న నేపథ్యంలో ఫ్యాక్టరీ సమీపంలో చిత్తూరు–వేలూరు రహదారిలో ఉన్న ట్రాక్టర్లు అన్నింటినీ వెంటనే సరిహద్దులోని తమిళనాడు ప్రాంతానికి అధికారులు పంపించేశారు. ఇక్కడ పెద్దగా రద్దీ లేదని ఆయనకు తెలియజేశారు. ఫ్యాక్టరీని పరిశీలించి వెళ్లిన అనంతరం గుడిపాల రెవెన్యూ అధికారులు తమిళనాడు ప్రాంతానికి వెళ్లి ట్రాక్టర్లకు టోకెన్లను అందజేసి ఒక్కో ట్రాక్టర్‌ను పంపించారు.