
అన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు విరాళాలు
కాణిపాకం: శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని అన్నదానం, గోంసరక్షణ ట్రస్టులకు శుక్రవారం దాత కుటుంబాలు నగదు విరాళం చేశాయి. హైదరాబాద్‌కు చెందిన దాత బాలాజీ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు మొత్తం రూ.1.73 లక్షలు నగదు విరాళం ఇచ్చారు. ఇందులో అన్నదాన ట్రస్టుకు రూ.62వేలు, గోసంరక్షణ ట్రస్టుకి రూ.1.11 లక్షల చొప్పున్న అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన సత్య నారాయణ రమాదేవి కుటుంబసభ్యులు గోసంరక్షణ ట్రస్టుకు రూ. 50వేలు, నిత్యాన్నదానం ట్రస్ట్కకు రూ.50 వేలు మొత్తం రూ. ఒక లక్ష విరాళం ఇచ్చారు. ఈ నగదును అందుకున్న ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి స్వామి వారి దర్శనం కల్పించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో
10 మందికి జరిమానా
చిత్తూరు అర్బన్: మద్యం తాగి వాహనాలు నడిపిన పది మందికి రూ.లక్ష జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్స్‌పల్ జూనియర్ సివిల్ కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
పరిశ్రమల స్థాపనకు భూముల పరిశీలన
శాంతిపురం: రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో ప్రతిపాదిత విమానాశ్రయ సమీపంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు శుక్రవారం భూములను పరిశీలించారు. అడిడాస్, నైక్ కంపెనీల ప్రతినిధులు దండికుప్పం, అమ్మవారిపేట, విజలాపురం, మణీంద్రం, కిలాకిపోడు ప్రాంతాల్లో పర్యటించారు. కడా ప్రాజెక్టు ఆఫీసర్ వికాస్ మర్మత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, శాంతిపురం తహసీల్దార్ శివయ్య కంపెనీల ప్రతినిధులను తీసుకువచ్చి భూములను చూపారు. అందుబాటులోని భూములు, సేకరించనున్న భూముల వివరాలను అధికారులు పారిశ్రామిక ప్రతినిధులకు వివరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.