
బాల్యవివాహాలను నిరోధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : బాల్య వివాహలను నిరోధించాలని 8వ డివిజన్ సచివాలయ మహిళా పోలీసు సునీత అన్నారు. శుక్రవారం నగరంలోని వెంగళరావు కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యుక్త వయసు బాలికల భవిష్యత్‌కు కిశోరి వికాసం కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మేనరికాలు, ఆచారాల పేరుతో బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాలు చేసి బాలికల జీవితాలను బుగ్గిపాలు చేయకూడదన్నారు. ప్రేమ పేరుతో మోసగించడం, నమ్మి వెంట వచ్చిన వారిని చిత్రహింసలు పెట్టడం, బాలికల ప్రాణాలకు ముప్పు కలిగేలా వ్యవహరించడం నేటి సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలని చెప్పారు. బాలికలు తమకు తాము కాపాడుకునేలా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా భయాందోళన చెందకూడదన్నారు. బాలికలు కౌమార దశలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం అరుణ, అంగన్‌వాడీ కార్యకర్త చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు.