అత్యాశతోనే చిక్కులు | - | Sakshi
Sakshi News home page

అత్యాశతోనే చిక్కులు

Mar 30 2023 1:32 AM | Updated on Mar 30 2023 1:32 AM

- - Sakshi

చిత్తూరు అర్బన్‌ : జాతీయస్థాయిలో సైబర్‌క్రైమ్స్‌ అధికంగా జరుగుతున్న నగరాల్లో చిత్తూరు పేరును లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్‌గా మారింది. మన రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాలు ఉండగా, సైబర్‌ నేరాలకు చిత్తూరు ఎలా అడ్డాగా మారిందనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

చాప కింద నీరులా..!

దేశ ఆర్థిక వ్యవస్థను, జాతీయ భద్రతా గ్రిడ్‌ను నిర్వీర్యం చేయడానికి శత్రుమూకలు చాలాకాలంగా ప్రయత్నం చేస్తున్నాయని, వారి పన్నాగాలను దీటుగా జవాబు ఇస్తున్నామని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో సైబర్‌క్రైమ్‌ రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తూపోతోంది. సైబర్‌ నేరాలను ఇన్వెస్టిగేషన్‌లో జిల్లా పోలీసుశాఖ ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా వ్యవహరిస్తోంది. బాధితులు ఎవరైనా స్టేషన్‌కు వస్తే వెంటనే ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదుచేస్తోంది. నిందితుల వివరాలను గుర్తించి వాళ్లు దేశంలో ఎక్కడున్నా అరెస్టు చేస్తోతది. ఈ గణాంకాలను ఎప్పటికప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలు నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరును సైబర్‌క్రైమ్స్‌ హాట్‌స్పాట్‌గా పేర్కొన్నట్లు జిల్లా పోలీసుశాఖ స్పష్టం చేస్తోంది. మహా నగరాల్లో అక్కడి జనసాంద్రత, నమోదవుతున్న కేసుల వివరాలు, నిందితుల అరెస్టుపై ఈ గణాంకాలు ప్రభావాన్ని చూపిస్తుండటంతో అవి హాట్‌స్పాట్‌ జాబితాలో లేవని వివరిస్తున్నాయి.

సైబర్‌ క్రైమ్‌ హాట్‌స్పాట్‌గా చిత్తూరు

దేశంలోని 36 నగరాల్లో ఒకటిగా ప్రకటన

జాతీయ సంస్థల హెచ్చరికతో

పోలీసుల అప్రమత్తం

ఆర్థిక వ్యవస్థపై కుట్రగా భావిస్తున్న కేంద్రం

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌ల కారణంగా ప్రపంచమే అరచేతిలో ఇమిడిపోయింది. మునివేళ్లపైనే సకలం చక్కబెట్టుకునే వెసులుబాటు వచ్చింది. ఈ క్రమంలోనే టెక్నాలజీని దుర్వినియోగం చేసే వ్యవస్థ సైతం రూపుదిద్దుకుంది. మనిషిలోని అత్యాశను అవకాశంగా తీసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతోంది. ఆర్థికపరమైన దోపిడీలకు తెరతీస్తూ పోలీసులకు పెను సవాల్‌ విసురుతోంది. ఈ మేరకు ఢిల్లీలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ దేశంలో సైబర్‌ క్రైమ్‌లకు హాట్‌స్పాట్‌లుగా మారిన 36 నగరాలను గుర్తించింది. అందులో చిత్తూరు పేరు పేర్కొనడంతో జిల్లా పోలీస్‌శాఖ ఉలిక్కిపడింది. సైబర్‌ నేరగాళ్లకు చెక్‌పెట్టేందుకు పకడ్బందీగా కసరత్తు చేపడుతోంది.

బాధితుల ప్రమేయం లేకుండా సైబర్‌ నేరాలు జరిగే అవకాశం ఉండదు. సాంకేతిక దొంగలు లింకులను స్మార్ట్‌ఫోన్లకు పంపి వాటిని క్లిక్‌ చేయమని చెప్పడం, ఆధార్‌ కార్డు– బ్యాంకుఖాతాకు లింకు చేయాలని ఓటీపీ అడగడం, ఆన్‌లైన్‌లో లాటరీ తగిలిందని క్లెయిమ్‌ చేసుసుకోవాలంటే కొద్దిగా డబ్బులు చెల్లించాలని మాయ మాటలు చెప్పడడం.. ఇలా రకరకాలుగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. వీరి వలలో చిక్కుకుని బాధితులు రూ.లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నారు. మనదికాని డబ్బు, వస్తువులను దక్కించుకోవాలని అత్యాశ పడితేనే చిక్కులు వస్తున్నాయని పోలీస్‌ శాఖ హెచ్చరిస్తోంది.

నేరాల కట్టడికి కృషి

సైబర్‌క్రైమ్‌లపై కేంద్రం హెచ్చరికలను ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నాం. నేరాలను ముందస్తుగా పసిగటివ్ట కట్టడికి కృషి చేస్తాం. ఇప్పటికే జిల్లాలోని 1,132 గ్రామాల్లో సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించాం. 93 విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దురదృష్టవశాత్తు ఇలాంటి నేరాల్లో యువతే ఎక్కువగా చిక్కుకుంటున్నారు. సైబర్‌ క్రైమ్‌ బాధితులు వెంటనే పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. డయల్‌–100, పోలీసు వాట్సప్‌–9440900005 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. ఈవిషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. – రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement