
12–14 శాతం పెరగొచ్చు
డేటాకు పెరుగుతున్న డిమాండ్
దీంతో అధిక ఆదాయం
తగ్గుతున్న మూలధన వ్యయాలు
క్రిసిల్ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల నిర్వహణ లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 12–14% పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. రూ.1.55 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది. డేటా వినియోగంతో సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) పెరుగుతుందని పే ర్కొంది. 5జీ సేవలను ప్రారంభించిన అనంతరం బలమైన పనితీరు, మూలధన వ్యయాల తీవ్రత తగ్గుతుండడం, మె రుగైన నగదు ప్రవాహాలు కంపెనీల రుణ పరపతికి మద్ద తుగా నిలుస్తున్నట్టు వివరించింది.
ఏఆర్‌పీయూ ప్రతి రూపాయి పెరుగుదలతో టెలికం కంపెనీలకు మొత్తంగా రూ.850–900కోట్లు సమకూరుతుందని వెల్లడించింది. టెలి కం రంగంలో 93% చందాదారులను కలిగిన మూడు ప్రము ఖ టెలికం కంపెనీలపై (జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్) అధ్యయనం చేసిన క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. టారిఫ్‌ల పెంపుతో టెలికం కంపెనీల నిర్వహణ లాభం 2024–25లో 17% వృద్ధి చెందడం గమనార్హం.
ప్రీమియం ప్లాన్లు..
ఓటీటీ సేవల కోసం డేటాకు డిమాండ్ పెరుగుతుండడంతో దీన్నుంచి ప్రయోజనం పొందేందుకు టెలికం కంపెనీలు ప్రీమియం ప్లాన్లను ఆఫర్ చేస్తుండడాన్ని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రస్తావించింది. ఇది కూడా సగటు యూజర్ వారీ ఆదాయాన్ని పెంచుతుందని తెలిపింది. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సేవల విస్తరణ మరో 4–5 శాతం పెరిగి 2026 మార్చి నాటికి 82 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.
వాయిస్ కాల్స్ ప్లాన్లను వినియోగిస్తున్న యూజర్లు డేటా ప్లాన్లకు మళ్లడం ఆదాయాన్ని పెంచుతుందని వివరించింది. ఈ ధోరణులతో టెలికం కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని.. అదే సమయంలో కంపెనీలకు 60 శాతం వ్యయాలు స్థిరంగా ఉంటాయి కనుక నిర్వహణ లాభం అధికమవుతుందని పేర్కొంది. అలాగే, మూలధన వ్యయాల అవసరం తక్కువగా ఉండడంతో ఫ్రీక్యాష్ ఫ్లో (నికర మిగులు నిల్వలు) పెరుగుతుందని వివరించింది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 31 శాతంగా ఉన్న మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24–26 శాతానికి (ఆదాయంలో) పరిమితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ తెలిపారు. స్పెక్ట్రమ్ కొనుగోళ్లు దాదాపుగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే ముగిశాయని, తదుపరి స్పెక్ట్రమ్ పెట్టుబడులు 2030లో అవసరపడతాయని చెప్పారు. ఇవన్నీ కలసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోకు దారితీస్తాయని తెలిపారు. కంపెనీల నికర రుణ భారం 3.4 రెట్ల నుంచి 2.7 రెట్లకు (మూలధనంతో దిగొస్తుందన్నారు.
రూ.225కు ఏఆర్‌పీయూ
‘‘గత ఆర్థిక సంవత్సరంలో ఏఆర్‌పీయూ రూ.205గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.220–225కు చేరుకుంటుంది. ప్రధానంగా అధిక డేటా వినియోగం ఇందుకు దోహదం చేస్తుంది. 5జీ నెట్‌వర్క్ లభ్యత మరింత విస్తృతమై 2026 మార్చి నాటికి 45–47 శాతానికి చేరుకుంటుంది. 2025 మార్చి నాటికి ఇది 35 శాతంగా ఉంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు.
సోషల్ మీడియా యాప్‌లు, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, జెనరేటివ్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ కోసం డేటా వినియోగం పెరుగుతున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సగటు యూజర్ నెలవారీ డేటా వినియోగం 27జీబీగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31–32జీబీకి పెరుగుతుందన్నారు. ‘‘టెలికం కంపెనీలు ప్లాన్లలో డేటా ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. లేదా అధిక డేటా ప్లాన్లపైనే 5జీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ చర్యలు కస్టమర్లు ప్రీమియం ప్లాన్లకు వెళ్లేలా చేస్తాయి. దీంతో కంపెనీల ఏఆర్‌పీయూ పెరుగుతుంది’’అని కులకర్ణి వివరించారు.