కొనగలుగుతున్నారా... తినగలుగుతున్నారా?

RBI Surveys To Get Inputs For Monetary Policy IESH 2021 - Sakshi

ద్రవ్యోల్బణం, వినియోగదారుని విశ్వాసంపై ఆర్‌బీఐ దృష్టి

కుటుంబ సర్వేలకు శ్రీకారం

ప్రస్తుతం, మూడు నెలలు, ఏడాది కాలాలపై మదింపు

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధాన సమీక్ష, నిర్ణయాల్లో మరింత పారదర్శకత, పటిష్టత నెలకొనబోతోంది. ఈ సమీక్షలకు ముందు ఇకమీదట ద్రవ్యోల్బణం అంచనాలకు సంబంధించి గృహ సర్వేలు (ఐఈఎస్‌హెచ్‌) నిర్వహించనుంది. ప్రస్తుతం, రానున్న మూడు నెలలు, ఏడాది కాలాల్లో ధరల తీరు ఎలా ఉండనుందన్న విషయాన్ని వినియోగదారు నుంచే తెలుసుకోవడం ఈ సర్వేల లక్ష్యం.  వినియోగదారు విశ్వాసాన్ని మరింత స్పష్టంగా తెలుసుకోవడానికి వినియోగ విశ్వాస సర్వే (సీసీఎస్‌)ను కూడా చేస్తుంది.   

18 నగరాల్లో ఐఈఎస్‌హెచ్‌ సర్వే 
తొలి దశగా 2021 జనవరి ఐఈఎస్‌హెచ్‌ని ప్రారంభిస్తున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. 18 నగరాల్లో దాదాపు 6,000 కుటుంబాల నుంచి అభిప్రాయాల సేకరణ జరుగుతుంది. ఈ నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, తిరువనంతపురం ఉన్నాయి. (చదవండి: రికార్డు స్థాయిలో జీఎస్‌టీ వ‌సూళ్లు)

13 నగరాల్లో సీసీఎస్‌ సర్వే...
13 నగరాల్లో వినియోగ విశ్వాస సర్వే (సీసీఎస్‌) నిర్వహణ జరుగుతుంది. వీటిలో హైదరాబాద్‌సహా అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పాట్నా, తిరువనంతపురం ఉన్నాయి.  ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఉపాధి కల్పనా తీరు ఏమిటి?  ధరల స్పీడ్‌ ఎలా? కుటుంబాల ఆదాయ, వ్యయాల పరిస్తితి ఏమిటి? వంటి అంశాలపై ఈ సర్వే ఉంటుంది.  ద్రవ్య పరపతి విధానంలో ఆయా అంశాలకు ప్రాధాన్యత ఉండే వీలుంది. 

సర్వే ఎవరు నిర్వహిస్తారంటే.. 
ఆర్‌బీఐ తరఫును ముంబైకి చెందిన ఒక సంస్థ ఈ సర్వేలు నిర్వహిస్తుంది. ముఖాముఖీ ఇంటర్వూ్యలు అలాగే టెలిఫోన్‌ సంభాషణల ద్వారా ఈ సర్వే జరుగుతుంది

పాలసీ సమీక్ష నిర్ణయాల్లో మరింత పటిష్టత, పారదర్శక
తాజా కీలక నిర్ణయంతో ఆర్‌బీఐ ఎంపీసీ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాల్లో మరింత పారదర్శకత, పటిష్టత ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 2021 ఫిబ్రవరి 3 నుంచి 5 వరకూ ఆర్‌బీఐ ఎంపీసీ ద్వైమాసిక సమావేశం జరగనుంది. నిజానికి ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష, నిర్ణయాలు 2016కు ముందు స్వయంగా గవర్నర్‌ తీసుకునేవారు. ఈ నిర్ణయాలకు ముందు ఆయన ఆర్థికమంత్రిని సంప్రదించేవారు. అయితే 2016 నుంచీ ఈ విధానంలో మార్పు వచ్చింది. గవర్నర్‌ నేతృత్వంలో ఆరుగురు ద్రవ్య విధాన  కమిటీ సభ్యులు మెజారిటీ ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైంది.

ఇక వీరిలో ముగ్గురు స్వతంత్ర సభ్యులు. ప్రభుత్వం నాలుగేళ్లకొకసారి వీరిని నియమిస్తుంది. గవర్నర్, డిప్యూటీ గవర్నర్‌ (మానిటరీ పాలసీ ఇన్‌చార్జ్‌) సహా మరో ఆర్‌బీఐ సీనియర్‌ అధికారి (మానిటరీ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌) మరో ముగ్గురు సభ్యుల్లో ఉన్నారు. ఈ సమావేశాలకు నలుగురు సభ్యుల కోరం తప్పనిసరి.  ఈ దిశలో మొట్టమొదటి ద్వైమాసిక సమావేశం 2016 అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఇప్పటికి 26 సమావేశాలు జరిగాయి.  

కాగా 2021 మార్చి దాకా ద్రవ్యోల్బణం నాలుగు శాతం స్థాయిలో (రెండు శాతం అటూ ఇటూగా) ఉండేలా చూసే బాధ్యతను ఆర్‌బీఐకి కేంద్రం అప్పగించింది. ప్రస్తుతం వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆరు శాతం పైనే ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి మందగమనం కారణంగా వడ్డీ రేట్లు తగ్గించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 115 బేసిస్‌ పాయింట్ల రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం)ను తగ్గించిన ఆర్‌బీఐ గడచిన మూడు ద్వైమాసిక సమీక్షల్లో ద్రవ్యోల్బణం తీవ్రతతో  మరింత కోతకు వెనుకడుగువేస్తోంది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుదల అంచనాలతో సరళతర విధానంవైపే మొగ్గు చూపుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top