Nirmala Sitharaman: రూపాయి విలువ భారీగా పతనం.. ఆర్థికమంత్రి కీలక ప్రకటన

Nirmala Sitharaman Says No Collapse Of Indian Rupee Falls Down Parliament - Sakshi

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ భారీ పతన ఆందోళనల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. భారత్‌ రూపాయి విలువ కుప్పకూలలేదని స్పష్టం చేశారు. అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. భారత్‌ రూపాయి మారకపు విలువను మార్కెట్‌ శక్తులు, డిమాండ్‌–సరఫరాల పరిస్థితులు నిర్దేశిస్తాయని అన్నారు. రాజ్యసభలో ఈ మేరకు ఆమె ఒక ప్రకటన చేస్తూ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భారత్‌ కరెన్సీ విలువను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

తీవ్ర ఒడిదుడుకులు ఉంటేనే సెంట్రల్‌ బ్యాంక్‌ జోక్యం ఉంటుందని అన్నారు. ‘‘భారత రూపాయి విలువను నిర్ణయించడానికి ఆర్‌బీఐ జోక్యం అంతగా లేదు, ఎందుకంటే దాని వాస్తవిక స్థాయిని అది గుర్తించడం సముచితం’’ అని మంత్రి రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
►   భారత్‌ రూపాయి ఏ స్థాయిలో ఉండాలన్న విషయాన్ని మనం నిర్ణయించలేము. అయితే అమెరికా డాలర్‌తో విలువ అస్థిరతను నియంత్రించడానికి ఆర్‌బీఐ వైపు నుండి తగిన జోక్యం ఉంటుంది.  
► భారతదేశం పలు ఇతర దేశాల తరహాలో తన కరెన్సీని ఒక స్థాయిలో ఉంచడానికి విపరీతంగా ప్రయతి్నంచడం లేదు.  అయితే కొంతమేర పటిష్టంగా, తీవ్ర ఒడిదుడుకులు లేకుండా చర్యలు తీసుకుంటుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటాయి.  
►  అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.  అయితే మన కరెన్సీ పనితీరు ఇతర వర్థమాన దేశాల కంటే మెరుగ్గా ఉంది. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌  ఫెడ్‌ నిర్ణయాల ప్రభావాన్ని తట్టుకోవడంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్‌ పటిష్టంగా ఉంది.

►  భారత్‌ విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు 650 బిలియన్ల గరిష్ట స్థాయి నుంచి పడిపోవడం పట్ల ఆందోళన చెందనక్కర్లేదు.  జూలై 22 నాటికి మన వద్ద 572 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయి. ఇవేమీ తక్కువ మొత్తం కాదు. విదేశీ మారకద్రవ్యం విషయంలో భారత్‌ తగిన స్థానంలో నిలుచుంది. కనుక ఈ సందర్భంలో నేను సభ్య దేశాలను కోరేది ఏమిటంటే, మిగిలిన దేశాలతో పోల్చితే భారత్‌ కరెన్సీ పటిష్టంగానే ఉంది.  

►  భారత్‌ కరెన్సీ బలహీనంగా ఉందని గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ఇప్పుడు తప్పు పట్టాల్సిన పనిలేదు. అప్పట్లో బలహీన ఆర్థిక వ్యవస్థ ఉంది. ద్రవ్యోల్బణం 22 నెలల పాటు రెండంకెల్లో కొనసాగింది. అయితే ఇప్పుడు ఎకానమీ పూర్తి రికవరీ బాటన పటిష్టంగా ఉంది. మహమ్మారి కరోనా, ఉక్రెయిన్‌–రష్యా ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత్‌ కరెన్సీ పటిష్టంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని విమర్శకులు గుర్తించాలి. 

చదవండి: రుతుపవనాలు ఎఫెక్ట్‌.. దిగొచ్చిన నిరుద్యోగం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top