
23 శాతం పెరుగుదల
2024–25 సంవత్సరంలో మెరుగైన వృద్ధి
ఈక్విటీల్లోకి రూ.4.17 లక్షల కోట్ల పెట్టుబడులు
ప్రతి నలుగురిలో ఒకరు మహిళా ఇన్వెస్టరే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 23 శాతం పెరిగి రూ.65.74 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్ ర్యాలీతో పెట్టుబడుల విలువ పెరగడానికి తోడు, నికర పెట్టుబడుల రాక ఏయూఎం వృద్ధికి తోడ్పడింది. 2023–24 చివరికి మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం రూ.53.40 లక్షల కోట్లుగా ఉంది.
‘‘ఆస్తుల పరిమాణం పెరగడానికి మార్క్ టు మార్కెట్ (ఎంటీఎం) పెరుగుదల సానుకూలించింది. నిఫ్టీ 50 టీఆర్‌ఐ 6 శాతం, సెన్సెక్స్ టీఆర్‌ఐ 5.9 శాతం చొప్పున పెరగడం ఇందుకు దోహదం చేసింది. డెట్ విభాగంలోనూ ఎంటీఎం పెరగడం అనుకూలించింది’’అని యాంఫి తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల పథకాల్లోకి రూ.8.15 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ఫండ్స్ నిర్వహణ ఆస్తుల వృద్ధికి దారితీసింది.
ముఖ్యంగా ఈక్విటీల్లోకి రికార్డు స్థాయిలో రూ.4.17 లక్షల కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్లు, పెట్టుబడి ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ ఇలా అన్నింటా వృద్ధి కనిపించింది. మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు 23.45 కోట్ల గరిష్టానికి చేరాయి. ఇన్వెస్టర్ల సంఖ్య 5.67 కోట్లకు పెరిగింది. 1.38 కోట్ల మంది మహిళా ఇన్వెస్టర్లు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈక్విటీ పథకాలకు సంబంధించి ఫోలియోలు 33 శాతం పెరిగి 16.38 కోట్లుగా ఉన్నాయి. అంటే మొత్తం ఫోలియోల్లో ఈక్విటీ ఫోలియోలే 70 శాతం మేర ఉండడం గమనార్హం. హైబ్రిడ్ ఫండ్స్ ఫోలియోలు 16 శాతం పెరిగి 1.56 కోట్లుగా ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల (ప్యాసివ్ ఫండ్స్) ఫోలియోలు 48 శాతం పెరిగి 4.15 కోట్లుగా ఉన్నాయి.
ఎన్‌ఎఫ్‌వోల జోరు
గత ఆర్థిక సంవత్సరంలో న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వోలు) కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. 70 ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్ నుంచి రూ.85,244 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. 2023–24లో వచ్చిన ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు 58కాగా, అవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులు రూ.39,297 కోట్లుగానే ఉన్నాయి. డెట్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.38 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
సిప్ పెట్టుబడులు రూ.2.89 లక్షల కోట్లు..
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి రికార్డు స్థాయిలో రూ.2.89 లక్షల కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 45 శాతం పెరిగాయి. సిప్ నిర్వహణ ఆస్తులు 24.6 శాతం పెరిగి రూ.13.35 లక్షల కోట్లకు చేరాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ మొత్తం నిర్వహణ ఆస్తుల్లో సిప్ ఏయూఎం 20.31 శాతానికి పెరిగింది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 24 శాతం మేర పెరిగి 1.38 కోట్లుగా (ప్రతి నలుగురిలో ఒకరు) ఉంది.
మహిళల్లోనూ ఆర్థిక స్వాతంత్య్రం, అవగాహన పెరుగుతోందని యాంఫి నివేదిక తెలిపింది. ఆర్థిక అక్షరాస్యతకు తోడు, ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌లోకి నికరంగా రూ.4.17 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే రెట్టింపయ్యాయి. దీంతో ఈక్విటీ పథకాల నిర్వహణ ఆస్తుల విలువ 25 శాతానికి పైగా పెరిగి రూ.29.45 లక్షల కోట్లకు చేరుకుంది.