రూ.1.50 లక్షల కోట్ల జీఎస్‌టీ ఇక సాధారణం | Sakshi
Sakshi News home page

రూ.1.50 లక్షల కోట్ల జీఎస్‌టీ ఇక సాధారణం

Published Mon, Feb 6 2023 9:22 AM

Monthly GST Revenue Rs 1.50 Lakh Cr To Be New Normal - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు సగటున రూ.1.5 లక్షల కోట్లు అన్నది ఇక మీదట సర్వసాధారణమని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చీఫ్‌ వివేక్‌ జోహ్రి పేర్కొన్నారు. పన్ను ఎగవేతల నిరోధానికి తీసుకున్న సమిష్టి చర్యలు, నూతన వ్యాపార సంస్థలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం వసూళ్ల విస్తరణకు తోడ్పడినట్టు చెప్పారు. జీఎస్టీ, కస్టమ్స్‌ వసూళ్లకు సంబంధించి 2023–24 బడ్జెట్‌లో ప్రకటించిన గణాంకాలు వాస్తవికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. సాధారణ జీడీపీ వృద్ధి, దిగుమతుల ధోరణుల ఆధారంగా వీటిని నిర్ణయించినట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించారు.

జీఎస్‌టీ ఆదాయం పెంచుకునేందుకు కఠిన ఆడిట్, పన్ను రిటర్నుల మదింపు, నకిలీ బిల్లులు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌పై చర్యలు అనే విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టాం. జీఎస్‌టీ విధానం తీసుకొచ్చినప్పటి నుంచి పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో పెరుగుదల మెరుగ్గా ఉన్నప్పటికీ, కొన్ని రంగాల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరిగేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. కనుక జీఎస్‌టీ ఆదాయం విషయంలో మేమింకా సంతృప్త స్థాయికి చేరుకోలేదు. ఆదాయం పెంచుకునే అవకాశాలున్నాయి’’ అని చెప్పారు. జీఎస్‌టీ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలవారీగా రూ.1.45 లక్షల కోట్లు ఉండడం గమనార్హం. 2023 జనవరికి రూ.1.56 లక్షల కోట్లు వసూలైంది. జీఎస్‌టీ చరిత్రలో 2022 ఏప్రిల్‌లో వచ్చిన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత నెలవారీగా అత్యధిక ఆదాయం రికార్డు ఇదే కావడం గమనించొచ్చు. 2022–23 సంవత్సరానికి జీఎస్‌టీ ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.9.56 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో భాగంగా మంత్రి సీతారామన్‌ ప్రకటించారు.   
 

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ ద్వారా 25,000 కోట్ల ఆదాయం: కేంద్రం 
విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ టాక్స్‌ ద్వారా మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 25,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ పెరిగినందున పన్ను  ప్రస్తుతానికి కొనసాగుతుందని సీబీఐసీ చైర్మన్‌ వివేక్‌ జోహ్రీ మరో ప్రకటనలో స్పష్టం చేశారు.  భారతదేశం 2022 జూలై 1వ తేదీన  విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల వల్ల  ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. తొలుత దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్‌ ప్రాఫిట్‌ ట్యాక్స్‌ విధింపు జరిగింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై కూడా కొత్త పన్ను అమలు జరుగుతోంది.  అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. చమురు అన్వేషణ, ఉత్పత్తికి ఈ పన్ను విఘాతమని పేర్కొంటూ, దీనిని తక్షణం తొలగించలని పారిశ్రామిక వేదిక – ఫిక్కీ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది.  
 

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు 
అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం క్రూడాయిల్, డీజిల్‌ వంటి వాటిపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై ఈ పన్ను టన్నుకు రూ. 1,900 నుంచి రూ. 5,050కి పెరిగింది. అలాగే డీజిల్‌ ఎగుమతులపై లీటరుకు రూ. 5 నుంచి రూ. 7.50కి కేంద్రం ట్యాక్స్‌ను పెంచింది. ఇక విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ. 3.5 నుంచి రూ. 6కి పెంచింది. ఈ కొత్త రేట్లు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చాయి. క్రూడాయిల్‌ అధిక రేట్లలో ట్రేడవుతున్నప్పుడు ఆయిల్‌ కంపెనీలకు ఆకస్మికంగా వచ్చే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ముడిచమురు బ్యారెల్‌ రేటు పరిమితిని 75 డాలర్లుగా నిర్ణయించారు. ఇతర దేశాల బాటలోనే, భారత్‌ గతేడాది జూలై 1న దీన్ని తొలిసారిగా విధించింది. క్రితం రెండు వారాల్లో ఆయిల్‌ సగటు ధరల ప్రకారం ప్రతి పక్షం రోజులకోసారి ఈ ట్యాక్స్‌ రేట్లను సమీక్షిస్తుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement