
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో వేర్‌హౌస్ మార్కెట్ ఆల్‌టైం హైకి చేరుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో పారిశ్రామిక గోడౌన్లలో దాదాపు 20 మిలియన్ చ.అ. లీజు లావాదేవీలు జరిగాయి. వార్షిక ప్రాతిపదికన 33 శాతం వృద్ధి నమోదైందని కొలియర్స్ నివేదిక వెల్లడించింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఢిల్లీ, చెన్నై వేర్‌హౌస్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. మొత్తం లీజింగ్‌లో సగం వాటా ఈ రెండు నగరాలదే..
గ్రేడ్–ఏ గిడ్డంగులు, పారిశ్రామిక షెడ్లకు సంబంధించిన స్థల సేకరణలో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్(త్రీపీఎల్) కీలకంగా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వచ్చిన డిమాండ్‌లో దాదాపు 32 శాతం వీరిదే.. ఒక్క త్రీపీఎల్ కాకుండా ఇంజనీరింగ్, ఈ–కామర్స్, ఆటోమొబైల్స్, రిటైల్ సంస్థలతో సహా చాలా విభాగాల నుంచి డిమాండ్ పెరిగింది.
2025 రెండో త్రైమాసికంలో పారిశ్రామిక, గిడ్డంగుల రంగం టాప్–8 నగరాల్లో దాదాపు 11 మిలియన్ చ.అ. డిమాండ్‌ను చూసింది. ఇది సంవత్సరానికి 52 శాతం పెరుగుదల. ఇందులో 60 శాతం వాటాతో ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలు దేశీయ పారిశ్రామిక గిడ్డంగుల రంగాన్ని ముందుకు నడిపించాయి.