
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి కె.సుబ్రమణియన్ స్థానంలో నియమితులైన ఆయన భారత్‌తోపాటు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ కొత్త పాత్ర ద్వారా మూడు దశాబ్దాల క్రితం తన కెరీర్ ప్రారంభించిన ఐఎంఎఫ్‌కే ఉర్జిత్ పటేల్ తిరిగివచ్చినట్లయింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్, యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పీహెచ్ డీ చేసిన పటేల్ 1990వ దశకం ప్రారంభంలో ఐఎంఎఫ్ లో భారత డెస్క్ పై పనిచేశారు.
కొన్నేళ్లుగా పటేల్ పబ్లిక్ పాలసీ, ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్, అకడమిక్ విభాగాల్లో విస్తృతమైన పోర్ట్ ఫోలియోను నిర్మించారు. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)లో ఇన్వెస్ట్‌మెంట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెండ్‌గా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్సీ)లో సీనియర్ బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి అధ్యక్షత వహించి బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ లో సీనియర్ ఫెలోగా పనిచేశారు.
2016 సెప్టెంబర్ లో రఘురామ్ రాజన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24వ గవర్నర్ గా నియమితులయ్యారు. 2016 నవంబరులో పెద్దనోట్ల రద్దు తర్వాత ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక అస్థిరతను నిర్వహించడం సహా పలు గణనీయమైన విధానపరమైన చర్యలు ఆయన తన పదవీకాలంలో చేపట్టారు. సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి, మిగులు నిల్వలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో బహిరంగ వివాదం తలెత్తడంతో వ్యక్తిగత కారణాలను చూపుతూ 2018 డిసెంబరులో రాజీనామా చేశారు.