
ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కొత్తగా గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లను (ఎఫ్‌వోఎఫ్) ప్రవేశపెట్టింది. గోల్డ్ ఈటీఎఫ్ సెప్టెంబర్ 2తో, ఎఫ్‌వోఎఫ్ సెప్టెంబర్ 3తో ముగుస్తుంది. దేశీయంగా పసిడి ధరలను ట్రాక్ చేసే ఈ ఫండ్స్.. పుత్తడిలో సులభతరంగా ఇన్వెస్ట్ చేసే సాధనాలుగా ఉపయోగపడతాయి.
ఈటీఎఫ్‌లో రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. డీమ్యాట్ లేకుండానే పసిడిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఫండ్ ఆఫ్ ఫండ్ ఉపయోగపడుతుంది. ఇందులో రోజుకు రూ. 250 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ ప్రకారం దేశీయంగా పసిడి ఆధారిత ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్కెట్, 2024 జూలైలో రూ. 34,455 కోట్లుగా ఉండగా 2025 జూలై నాటికి రూ. 67,634 కోట్లకు పెరిగింది.
యాక్సిస్ నిఫ్టీ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్..
దేశీయంగా అత్యంత నాణ్యమైన యాభై కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా నిఫ్టీ500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్‌ను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఇందులో సెప్టెంబర్ 4 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. నిఫ్టీ 500 నుంచి ఎంపిక చేసిన యాభై స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి.
ఈక్విటీపై అత్యధిక రాబడులు, తక్కువ రుణభారం, స్థిరమైన ఆదాయ వృద్ధిలాంటి అంశాలను స్టాక్స్ ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. 2025 జూలైతో ముగిసిన 15 ఏళ్ల వ్యవధిలో నిఫ్టీ 50 వార్షికంగా 12.1 శాతం వృద్ధి చెందగా, నిఫ్టీ 500 క్వాలిటీ 50 ఇండెక్స్ 15. 6 శాతం వృద్ధి రేటు సాధించినట్లు సంస్థ తెలిపింది.