
ఏఐ సాధనాలు మరింత అధునాతనంగా మారినప్పటికీ, కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే మానవ మేధస్సును ఏదీ భర్తీ చేయలేదని నిపుణులు భావిస్తున్నారు. అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో భారతదేశంలో 83% మంది నిపుణులు, హైదరాబాద్‌లోని 88% మంది నిపుణులు ఏఐపై ఆధారపడడం కంటే మానవ మేధస్సుకు ఓటేస్తున్నారు.
లింక్డ్‌ఇన్ అధ్యయనంలోని అంశాలు..
హైదరాబాద్‌లో 79% మంది ఉద్యోగ విధుల్లో భాగంగా ఏఐని వాడుతున్నట్లు చెబుతున్న సమయంలో కీలక నిర్ణయాల విషయంలో మాత్రం ఏఐ సాయం తీసుకోకపోవడం గమనార్హం.
75% మంది తమ కెరియర్‌లో ఎదిగేందుకు ఏఐలో ప్రావీణ్యం సంపాదించడం అవసరమని భావిస్తున్నారు.
ఏఐలో నైపుణ్యం సాధించడం రెండో ఉద్యోగంలా అనిపిస్తుందని హైదరాబాద్‌లోని నలుగురు నిపుణుల్లో ముగ్గురు అంగీకరిస్తున్నారు.
59% మంది ఏఐని పూర్తి సామర్థ్యంతో ఉపయోగించడం లేదని చెబుతున్నారు.
75% మంది నిపుణులు ఏఐ తమ రోజువారీ పని జీవితాన్ని మెరుగుపరుచగలదని నమ్ముతున్నారు.
78% మంది నిపుణులు ఏఐని నిజమైన నిర్ణయం తీసుకోవడానికి కాకుండా రాయడం, డ్రాఫ్టింగ్‌కు ఉపయోగకరంగా భావిస్తున్నారు.
70% మంది ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏఐ కంటే కూడా తమ సొంత నిర్ణయాలనే నమ్ముతున్నారు.
భారతదేశంలో 83% మంది కార్యనిర్వాహకులు మంచి వ్యాపార నిర్ణయాలు మానవ మేధస్సుపైనే ఆధారపడి ఉంటాయని నమ్ముతున్నారు.
లింక్డ్ఇన్ కెరియర్ నిపుణులు, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరజిత బెనర్జీ మాట్లాడుతూ ‘ఏఐ ఒక అద్భుతమైన సాధనం. ఇది వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతోంది. రోజువారీ పనులను క్రమబద్ధీకరించగలదు. అయితే కీలక విషయాల్లో నిర్ణయం తీసుకునేప్పుడు చాలామంది ఏఐపై ఆధారపడడం లేదు. ఏఐని తాము విశ్వసించే సాధనంగానే కానీ, అనుసరించే సాధనంగా భావించడంలేదు. మానవులు మాత్రమే చేసే పని కోసం సమయాన్ని ఆదా చేసేందుకు ఏఐని ఉపయోగించాలి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు?